ఆ పార్టీల టికెట్లు ఎవరికో..?

by Shiva |   ( Updated:2023-10-12 06:09:55.0  )
ఆ పార్టీల టికెట్లు ఎవరికో..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేయగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. దీంతో ఈ రెండు పార్టీల నేతలు కార్యకర్తలతో పాటు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

కొన్ని నియోజకవర్గాలు మినహా స్పష్టత కరువు..

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఖరారు విషయంలో చేస్తున్న జాప్యం అధికార పార్టీకి కలిసి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మంచిర్యాల, నిర్మల్ నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్ ఖరారు విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్ రావు, నిర్మల్‌లో శ్రీహరి రావు పేర్లు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు చేసినట్లు కనిపించడం లేదు. మరో ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆసీఫాబాద్ నియోజకవర్గంలో ఆదివాసీలకు టికెట్ ఇవ్వాలని వలస వచ్చిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వొద్దని మంగళవారం గాంధీభవన్ ఆదివాసీలు ఆందోళనకు దిగిన విషయం రాజకీయంగా చర్చకు దారి తీసింది. మిగిలిన నియోజకవర్గం ఇదే పరిస్థితి నెలకొంది.

బీజేపీలోనూ ఇదే పరిస్థితి..

బీజేపీ సైతం ఇప్పటిదాకా అభ్యర్థుల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి, సిర్పూర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ బాబు మాత్రమే ఖరారు అయినట్లు చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో టికెట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధిష్టానం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ ఉంది. టికెట్ల ఖరారు తర్వాత అభ్యర్థుల కప్పదాటు మొదలవుతుందని సమాచారం.

Advertisement

Next Story