మలుపు తిరుగుతోన్న బిట్‌కాయిన్ దందా కేసు..! తాజాగా మరో ముగ్గురి అరెస్ట్

by Shiva |
మలుపు తిరుగుతోన్న బిట్‌కాయిన్ దందా కేసు..! తాజాగా మరో ముగ్గురి అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: బిట్‌కాయిన్ దందా కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. 20 రోజుల క్రితం ఐదుగురి అరెస్ట్‌తో తెరపైకి వచ్చిన దందాపై ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం గమనార్హం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయిన యుబిట్ కాయిన్ దందాలో మరో ముందడుగు వేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంలో ఉన్న కీలక వ్యక్తులు, చైన్ లింక్‌లో ఉన్న మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దర్యాప్తులో మరో ముందడుగు

యుబిట్ కాయిన్స్ మోసం కేసులో కొనసాగుతోన్న దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. తాజాగా అరెస్టు చేసిన ముగ్గురి ద్వారా మరింత సమాచారం సేకరించి కేసు దర్యాప్తు చేయనున్నామని ప్రకటించారు. మోసపూరిత పథకాన్ని ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించిన కేసులో తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులు‌ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు కారణమైన నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడంలో కీలకమైన ముందడుగని ఎస్పీ తెలిపారు.

తాజాగా మరో ముగ్గురి అరెస్ట్..

బిట్ కాయిన్ వ్యవహారంలో తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేసి బుధవారం నిర్మల్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారిలో కడెం మండలం కన్నాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి రమేష్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బొమ్మిడి ధనంజయ్, నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్‌కు చెందిన కీరం వెంకటేష్ ఉన్నారు. వీరు మోసపూరిత పథకాన్ని ప్రచారం చేయడం, అధిక రాబడుల గురించి తప్పుడు వాగ్ధానాలతో పెట్టుబడిదారులను ప్రలోభపెట్టడంలో కీలక పాత్రధారులని పోలీసులు తెలిపారు.

కీలక కుట్రదారు గుర్తింపు

బిట్‌కాయిన్ దందాలో ప్రధాన కుట్రదారు బ్రిజ్ మోహన్ సింగ్ అని వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేసిన ఈ స్కామ్‌ను ఆర్కెస్ట్రేట్ చేయడంలో ఇతను పాల్గొన్నాడని ఆమె వెల్లడించారు. అతడి అంతకు ముందే మోసపూరిత కార్యకలాపాల చరిత్ర ఉందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

బ్యాంకు ఖాతాల స్తంభన..

కొనసాగుతున్న విచారణలో భాగంగా నిర్మల్ పోలీసులు మోసపూరిత పథకంతో ముడిపడి ఉన్న 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. కుంభకోణంలో పాల్గొన్న వారి ఆర్థిక లావాదేవీలను పోలీసులు ట్రాక్ చేస్తూనే ఉన్నందున, అదనపు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసే ప్రక్రియతో పాటు ఆస్తుల గుర్తింపు ప్రస్తుతం కొనసాగుతోందని అన్నారు. నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో, బాధితుల సొమ్ముకు భద్రత కల్పించడంలో ఈ దశ కీలకమైనదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story