ప్రజల సంపద పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

by Naresh |
ప్రజల సంపద పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, బోథ్: ప్రజల సంపద పెంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో బోథ్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఆడే గజేంద్ర పాల్గొన్నారు. అనంతరం బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ కోసం ఎనలేని సేవ చేసిన కార్యకర్త బొడ్డు గంగారెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అని తెలిపారు. గంగారెడ్డి పార్టీ మీటింగ్ కూడా తన సొంత ఖర్చులతో హాజరు అయ్యే కార్యకర్త అని అందుకే పదవి ఇప్పించే బాధ్యత నేనే తీసుకున్న అని తెలిపారు. ఇలా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు.

అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ధనిక,పేద అనే భేదం చూడదు అని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తను చూస్తుందని తెలిపారు. దానికి ఉదాహరణ నేనే అని తెలిపారు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన నాకు టికెట్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే గా చేసింది అని, అది ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వం డబ్బు ఉన్నవారికి పెద్ద పీట వేస్తుండే అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కోసం కష్టపడ్డ బొడ్డు గంగారెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక చేయడం కాంగ్రెస్‌కే దక్కుతుంది అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఉంటే పనులు, పదవులు రావు అని కష్టపడాలి అని తెలిపారు. ఎవరూ కూడా నాకు ఎమ్మెల్యే, మంత్రి తెలుసు డబ్బులు ఇస్తే పదవి ఇప్పిస్తా అంటే ఎవరు నమ్మొద్దు అని పార్టీ కోసం కష్టపడాలి అని పదవులు అవే వస్తాయి అని తెలిపారు. నూతన మార్కెట్ పాలకవర్గం రైతుల కోసం పని చెయ్యాలి అని, వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.

అనంతరం ఆదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా గల ప్రభుత్వమని, నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని రైతుల కోసం పనిచేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత తేవాలని కోరారు. గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం అప్పులు చేసిన ప్రభుత్వం అని రూ. 70 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి నెలకు వడ్డీగా రూ. 70 వేల కోట్లు పడుతుందని అవి కూడా ప్రజలను మోసం చేసి వారు పెద్ద పెద్ద భవంతులు, సూటు బూటు వేసుకొని రాజభోగాలు అనుభవించారని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు పేదలకు ఇల్లు ఇవ్వని ప్రభుత్వం ఉంది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పేదల ప్రభుత్వమని పేదల కోసమే పనిచేసే ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు పరుస్తం అని తెలిపారు. దానిలో భాగంగా సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రారంభించాం అని, ఈ ఉచిత బస్సు వలన నా మహిళా సోదరీమణులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అలాగే ఆరోగ్య బీమా రూ. 10 లక్షల పెంచామని, చేవెళ్ల బహిరంగ సభలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రూ. 500 గ్యాస్ సిలిండర్ ప్రారంభించామని దీనివల్ల మహిళా సోదరీమణులకి ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. అలాగే మరి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఇల్లు మంజూరు చేస్తామని, కుల మత భేదాలు తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం గొడవలు సృష్టిస్తుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వం ప్రభుత్వమని అందరూ సమానమే అని తెలిపారు. సమాచార చట్టం, అటవీ హక్కు చట్టం, పేద కుటుంబాలకు ఉపాధి హామీ కూలి చట్టం తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. అలాగే ఎప్పుడు ప్రజల్లో ఉండేవారే నాయకులు అవుతారని, కార్యకర్తలు ఎప్పుడు ప్రజల్లో ఉండాలని కోరారు. నేను కూడా మొదటిసారి ఓడిపోయిన వ్యక్తిని ఓటమికి బాధపడకుండా నిరంతరం ప్రజల్లో ఉన్న అని ప్రజల కోసం పని చేశానని తెలిపారు.

కష్ట పడ్డ వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేయాదు. కావున ప్రతి ఒక్క కార్యకర్త రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపియ్యాలని తెలిపారు. కష్టపడితే కార్యకర్తకి కచ్చితంగా ఉన్నత స్థానాల్లో ఉంచే బాధ్యత నాదే అని కార్యకర్తలకు తెలియజేశారు. నా దగ్గరికి డబ్బులు, హుందాతనం చుపెట్టుకోవడనికి రావొద్దు అని సమస్యలు తీసుకొని రావాలి అని నాయకులకు తెలిపారు. అలాగే బోథ్ రెవెన్యూ డివిజన్ అంశం పైన ఖచ్చితంగా కేబినెట్‌లో మాట్లాడతా అని బోథ్ నియోజవర్గంనీ అభివృద్ధి చేస్తాం అని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచడంలో దృష్టి ఉంది అని త్వరలో మిగతా సమస్యలు కూడా సానుకూల పరుస్తం అని తెలిపారు. అనంతరం వివిధ మండలాలు, గ్రామాల నుంచి ఆడే గజేంద్ర సమక్షంలో సీతక్క చేతుల మీదుగా కండువా కప్పి కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, బజార్ హత్నూర్ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed