పేరు మేజర్ ... తీరు బేజార్..

by Sumithra |
పేరు మేజర్ ... తీరు బేజార్..
X

దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మేజర్ ప్రగతి తప్పుతోంది. పేరులో మేజర్ తీరులో బేజార్ అన్న చందంగా మారింది. జీపీకి ఏడాదికి రూ.కోట్లల్లో ఆదాయంలో వస్తున్న అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆదిలాబాద్ టూ నిర్మల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట పాదచారులు, వివిధ వాహనాల రాకతో రద్దీగా ఉంటుంది. అలాంటి ఈ రహదారి పై మూడురోజుల నుంచి మురుగు నీరుతో కంపు కొడుతోంది. కనీసం పాలకులు కన్నెత్తి చూడలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు ఓ వైపున ఉన్న మురుగు కాలువలో చెత్తా, చెదారం పేరుకు పోవడంతో గత మూడు రోజుల నుంచి ఈ రహదారి పై నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది. ప్రధాన రహదారికి మరమ్మతులు లేక పూర్తిగా అద్వానంగా మారడం.. రోడ్డు పై అర ఫీట్ లోతు గుంతలు ఏర్పడటంతో మురుగు నీరు గుంతలలో నిల్వ ఉండి, దుర్గంధం వెదజల్లుతుండంతో జనాలు ముక్కున వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

తీవ్ర ఇబ్బందులు..

ఒక వైపు రోడ్డు పై మురుగు నీరు నిల్వ, మరోవైపు కంపు కొడుతూ మురుగు నీరు పారుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు నిర్మల్, అటు ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలు రోడ్డు పై పారుతున్న మురుగు నీటి మీద నుంచే వేగంగా వెళ్తుండటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారుల పై మురుగునీరు పడుతోంది. పెద్ద గుంతలో నీరునిల్వ ఉండటంతో వాహనాలు అదుపు తప్పిపడి, ప్రమాదాలకు జరుగుతున్నాయి. మోటార్ బైక్ నుంచి కింద పడుతూ గాయలపాలవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులున్న కూడా.. నిర్లక్ష్యం..

జీపీ పరిధిలో ఉన్నవార, దిన, పశువులు, మేకల సంతలకు మార్చి చివరి వారంలో వేలం పాటలు నిర్వహించారు. వేలం పాటల ద్వారా సుమారు రూ.15 లక్షల పైనే ఆదాయం సమకూరింది. జీపీలో నిధులున్నా కూడా సమస్యను పరిష్కరించడంలో పాలకులు, పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇచ్చోడ వాసులు వాపోతున్నారు. మరో రెండు వారాల్లో వర్షాకాలం రానుంది. పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదని, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారం పూడికతీత పనులు ఇంకా చేపట్టలేకపోతున్నారని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story