కష్టాల్లో 108 సిబ్బంది.. ఎనిమిదేండ్లుగా పెరగని జీతాలు..?

by Mahesh |
కష్టాల్లో 108 సిబ్బంది.. ఎనిమిదేండ్లుగా పెరగని జీతాలు..?
X

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గుర్తుకు వచ్చేది 108. ఎవరు ఫోన్ చేసినా యాక్సిడెంట్ ప్లేస్ లో వచ్చివాలిపోతారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడుతారు. అయితే అందులో పని చేస్తున్న సిబ్బందిని మాత్రం ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. ఎనిమిదేండ్లుగా వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నది. ప్రతి ఏడాది పది శాతం వేతనాలు పెంచుతామని నిర్వహణ సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన హామీ కూడా నెరవేరకుండా పోతున్నది. తాజాగా 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్ట్‌ను మళ్లీ జీవీకే దక్కించుకున్నది. దీంతో తమను నేషనల్ హెల్త్ మిషన్ లో చేర్చి జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ వ్యాప్తంగా 108 వాహనాలు మొత్తం 416 ఉన్నాయి. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వీటి ద్వారా సేవలందిస్తున్నారు. ఈ అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను ఎప్పటి నుంచో జీవీకే సంస్థ చూస్తున్నది. ప్రతి వాహనం పై ప్రభుత్వం సంస్థకు నెలకు రూ. 1,81,000 చొప్పున చెల్లిస్తున్నది. ఇందులో నుంచే సంస్థ సిబ్బంది జీతాలు, వాహనం మెయింటెనెన్స్, డీజిల్ వంటి ఖర్చులన్నీ భరిస్తున్నది. ప్రతి వాహనంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఈఎంటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎనిమిదేండ్లుగా పెరగని వేతనాలు

కొత్తగా ఉద్యోగంలో చేరిన పైలట్ కు రూ. 10 వేలు, ఈఎంటీకి రూ. 11వేలు చెల్లిస్తున్నారు. సీనియర్లను రెండు కేటగిరీలుగా విభజించి, రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఇస్తున్నారు. అయితే 2016 నుంచి సిబ్బందికి వేతనాలు పెంచలేదు. పీఆర్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30 శాతం వరకు వేతనాలు పెంచింది. కానీ 108 అంబులెన్సుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రూపాయి కూడా పెరగలేదు.

మళ్లీ 'జీవీకే'కు కాంట్రాక్టు

108 వాహనాల నిర్వహణ బాధ్యతలను జీవీకే సంస్థకు అప్పగిస్తున్న ప్రభుత్వం, మూడు, నాలుగు నెలలకోసారి కాంట్రాక్టును పొడిగిస్తుంది. రెగ్యులర్ కాంట్రాక్ట్ లేకపోవడంతోనే ఇన్నాళ్లు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ఆ సంస్థ ఒక నిర్ణయం తీసుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా జీవీకే సంస్థ లాంగ్ స్టాండింగ్ లో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టును దక్కించుకున్నది. దీంతో ఇప్పటికైనా తమ వేతనాలను పెంచాలనే డిమాండ్ 108 ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నది.

మూడు స్లాబుల విధానంపై హామీ

గతంలో ఉద్యోగులకు ప్రతి ఏటా 10% వేతనం పెంచుతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు అది అమలు కాలేదు. తాజాగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ఉద్యోగులకు మూడు స్లాబుల్లో జీతం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఆపై పని చేసిన ఉద్యోగులుగా విభజించి వేతనాలు ఖరారు చేస్తామని జీవీకే సంస్థ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఉద్యోగుల్లో అసంతృప్తి

జీవీకే సంస్థ కొత్తగా అమలు చేస్తామన్న వేతనాలపై సైతం ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, అనుబంధ కార్పొరేషన్ల ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీలో అమలు చేసినట్లుగా, 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తెచ్చి నేషనల్ హెల్త్ మిషన్ కింద చేర్చాలని కోరుతున్నారు.

Advertisement

Next Story