మొదలైన ధాన్యం కొనుగోళ్లు.. ఖరారు కాని ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు

by Mahesh |
మొదలైన ధాన్యం కొనుగోళ్లు.. ఖరారు కాని ట్రాన్స్‌పోర్ట్ టెండర్లు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించే ట్రాన్స్పోర్ట్ టెండర్ల వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. వారం రోజులు దాటితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు ఎక్కడికక్కడ పేరుకు పోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆ పరిస్థితి తలెత్తితే కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళనలకు దిగే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

ట్రాన్స్ పోర్ట్ టెండర్లలో ఏం జరిగింది..?

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని తరలించేందుకు అధికార యంత్రాంగం ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసి టెండర్లను పౌరసరఫరాల శాఖ, జిల్లా అదనపు కలెక్టర్ టెండర్లను పిలిచారు. తొలిసారి టెండర్ పిలిచినప్పుడు నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ లారీ అసోసియేషన్, భాగ్యనగర్ లారీ అసోసియేషన్ ఇద్దరూ టెండర్లు దాఖలు చేశారు. తక్కువ రేటుతో దాఖలు చేసిన నిర్మల్ లారీ అసోసియేషన్ కు అధికారులు ధాన్యంట్రాన్స్‌పోర్ట్ అప్పగించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ పొందిన యాజమాన్యం ధాన్యాన్ని రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలి. కొనుగోలు ప్రక్రియకు ముందే ఈ వ్యవహారం పూర్తి కావాలి. అందుకు తగ్గట్టుగానే అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న నిర్మల్ లారీ అసోసియేషన్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా టెండర్ లో పాల్గొన్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు టెండర్ రద్దు చేసి మరోసారి టెండర్లు ఆహ్వానించారు. రెండోసారి కూడా ఈ రెండు యాజమాన్యాలే టెండర్ లో పాల్గొన్నాయి. అధికారులు ఇద్దరి బిడ్ లను పరిశీలించి మరోసారి నిర్మల్ లారీ అసోసియేషన్ కే టెండర్ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై భాగ్యనగర్ లారీ అసోసియేషన్ మళ్ళీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఒకసారి టెండర్ లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి డిస్ క్వాలిఫై అయితే 12 నెలల పాటు వారికి మళ్లీ టెండర్ లో పాల్గొనే అవకాశం ఇవ్వవద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని ప్రత్యర్థి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అధికారులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దగ్గర పడుతుండడంతో రెండోసారి కూడా టెండర్ పొందిన నిర్మల్ లారీ అసోసియేషన్ తో అగ్రిమెంట్ కుదిరించినట్లు సమాచారం.

వ్యవహారం హైకోర్టుకు..

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో అధికారులు ట్రాన్స్పోర్ట్ టెండర్లను వేగంగా ఖరారు చేశారు టెండర్ విధానం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ప్రత్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ధాన్యం ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ ప్రక్రియ నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 125 పైగా కొనుగోలు కేంద్రాలు ఉండగా ఇప్పటికే సగం కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం అయ్యాయి. వారం లోగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోతాయి. ఆ పరిస్థితుల్లో ధాన్యం తరలించడం ఎలా అన్న వ్యవహారంపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి చేయి జారకముందే అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని అవసరం అయితే ఈ ఇద్దరినీ కాదని మూడో యాజమాన్యంతో ధాన్యం తరలించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story