ప్రజాస్వామ్యవాదులు కదం తొక్కాలి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Vinod kumar |   ( Updated:2023-03-26 12:04:30.0  )
ప్రజాస్వామ్యవాదులు కదం తొక్కాలి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, తాండూర్: రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించి కదం తొక్కాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని బురుగూడ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బస శిబిరం వద్ద ఆదివారం ఆయన సంకల్ప దీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేశారు.


దీక్షకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు రాహుల్ కి మద్దతు లభించడం, అదానీ అంశంపై పదేపదే నిలదీస్తుండడంతో మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేక సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ను సాకు చేసుకుని రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేసిందన్నారు.

దేశ ప్రజలు రాహుల్‌కు అండగా నిలువాలన్నారు. కుమురంభీం, మంచిర్యాల జిల్లాల ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కుమురంభీం, మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, కొక్కిరాల సురేఖ, పీసీసీ సభ్యులు గణేష్ రాథోడ్, నాయకులు మర్సు కోల సరస్వతి, శ్రీనివాస్, సూరం రవీందర్ రెడ్డి, కాపర్తి సుభాష్, చిలుముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story