రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టేది..ప్రాణాలు పోతున్న కనిపించని చర్యలు

by Aamani |
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టేది..ప్రాణాలు పోతున్న కనిపించని చర్యలు
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. అయినా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఎందరో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలలో పెద్ద వారితో పాటు ఎందరో మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా చర్యలు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన రహదారి అయినటువంటి గుడిహత్నూర్ మండలంలో మేకల గండి వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మండలంలోని మేకల గండి వద్ద రాత్రి 11:30 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల మధ్యలో జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాదుకు వెళ్లే ప్రధాన రహదారి అయినటువంటి గుడి మండలంలో గల మేకల గండి వద్ద జరుగుతున్న ప్రమాదాలలో కొద్ది రోజుల్లోనే 15 మంది మృతిచెందగా, ఎందరో మంది అవిటివారిగా మారారు.

మేకల గండి వద్ద జరిగిన ప్రమాదాలు..

2022 అక్టోబర్ 31న గుడిహత్నూర్ మండలంలో మేకల గండి వద్ద రాత్రి 11.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వెనుక నుంచి వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో కారు వేగంగా వెళ్లి ముందున్న కంటైనర్ లో ఇరుక్కపోయి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ కు చెందిన పంచాయతీ రాజులు డిఈ గా పనిచేస్తున్న సయ్యద్ రఫతుల్లా, రఫతుల్లా కూతురు షబియా హష్మీ తో పాటు వెనుక సీటులో ఉన్న ఆయన తమ్ముడు కుమారుడు వజాహద్, డ్రైవర్ శంషోద్దీన్ మృతి చెందారు.

గత ఏడాది జూలైలో 8న తెల్లవారు జాము 4 గంటల ప్రాంతంలో మేకల గండి మూలమలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీకి చెందిన ఏముల పొచ్చన్న (58) తన కుటుంబ సభ్యులైన తొమ్మిది మందితో ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ కు వస్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ఆటో లోని ప్రయాణికులు ఎగిరి పడ్డారు. దీంతో పొచ్చన్నతో పాటు భార్య గంగమ్మ, కూతురు శైలజ, బంధువు మడావి సోంబాయి నలుగురు మృతి చెందారు.

తాజాగా 9 రోజుల క్రితం అనగా గడిచిన సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇలా గుడిహత్నూర్ మండలం మేకల గండి మూలమలుపు మృత్యు మలుపుగా మారి ఎన్నో కుటుంబాలను బలి తీసుకుంటుంది. మూడేళ్లలో మేకల గండి నుండి సీతగోంధీ ప్రాంతంలో 25 మంది మృత్యువాత పడగా, కేవలం మేకల గండివద్దనే 15 మంది చనిపోయారు. ఇందులో ఒక్కో కుటుంబంలో ముగ్గురు నుంచి నలుగురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మొత్తం మీద జాతీయ రహదారిపై ఇప్పటివరకు 70 మంది మృతిచెందారు.

Advertisement

Next Story