మీద మిటమిట లోపట లోటలోట.. ప్రభుత్వాసుపత్రిలో కరువైన వైద్యం...

by Sumithra |
మీద మిటమిట లోపట లోటలోట.. ప్రభుత్వాసుపత్రిలో కరువైన వైద్యం...
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యసేవలు కరువైనవని మీద మిటమిట లోపట లోటలోట అన్న చందంగా తయారైందని పట్టణ భాజపా నాయకులు విమర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేవని రోజు వందలాది మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార పార్టీ నాయకులలో చలనం లేదని ఆస్పత్రిలో అన్ని విభాలకు చెందిన వైద్యులు లేకపోవడం దానితో పాటు సిబ్బంది కొరత ఉన్నదని ఆర్థిక పరిస్థితులు బాగా లేక తప్పని పరిస్థితులలో రోజు వందలమంది పేషెంట్లు ఈ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వస్తుంటారని వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో పేషెంట్ కు కనీసం ప్రథమ చికిత్స చేయకుండానే మంచిర్యాలకు ఆసుపత్రికి తరలించడం ఇక్కడ సిబ్బందికి ఆనవాయితీగా మారిందని వారు విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 కోట్లతో ఎంతో అట్టహాసంగా నూతన భవన నిర్మాణానికి నోచుకున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయేమోనని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూసినప్పటికీ, ఇక్కడ మాత్రం నిరాశే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని వైద్య సేవలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు , బత్తుల సమ్మయ్య, నగునూరి వెంకటేశ్వర గౌడ్, కమ్మల శ్రీనివాస్, జాడి తిరుపతి, వెంకట నరసయ్య, కెవీఎం శ్రీనివాస్, చారి, లక్ష్మీనారాయణ రెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed