అమల్లోకి కొత్త నేర చట్టాలు..గ్వాలియర్‌లో తొలి కేసు నమోదు

by vinod kumar |
అమల్లోకి కొత్త నేర చట్టాలు..గ్వాలియర్‌లో తొలి కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మారుస్తూ కేంద్రం ప్రభుత్వం రూపొందించిన కొత్త క్రిమినల్ చట్టాలు దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలు అమలులోకి వచ్చాయి. దీంతో జీరో ఎఫ్ఐఆర్, క్రిమినల్ కేసుల విచారణ, మహిళలు, పిల్లల నేరాలతో సహా పలు కేసులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు జరిగాయి. అలాగే ఎలక్ట్రానిక్ పద్దతిలో సమన్ల జారీ, డిజిటల్ చార్జిషీట్ వంటివి కూడా అధికారికంగా అమలు కానున్నాయి. అయితే జూలై 1 కంటే ముందు నమోదైన నేరాలపై పాత చట్టాల ప్రకారమే విచారణ జరుగుతుంది. జూలై 1 తర్వాత నమోదైన అన్ని నేరాలు కొత్త చట్టాల పరిధిలోకి వస్తాయని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, ఈ మూడు చట్టాలకు 2023 డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా..అదే నెల 25న రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు.

గ్వాలియర్‌లో తొలి కేసు నమోదు

కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక తొలి కేసు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నమోదైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇది మోటార్‌సైకిల్ దొంగతనానికి సంబంధించినదని స్పష్టం చేశారు. జూలై 1 రోజు 12.10 నిమిషాలకు ఈ కేసును పోలీసులు నమోదు చేసినట్టు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ల ప్రకారం ఈ కేసు నమోదైంది. అయితే, కొత్త చట్టాల ప్రకారం మొదటి ఎఫ్‌ఐఆర్ ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై బీన్ఎస్‌లోని సెక్షన్ 285కింద నమోదు చేసినట్టు అంతకుముందు పలు కథనాలు పేర్కొన్నాయి.

పూర్తి స్వదేశీ వ్యవస్థగా మారింది: అమిత్ షా

చట్టాల అమలు తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ చట్టాలపై మీడియాకు తెలియజేశారు. కొత్త చట్టాల ప్రకారం..శిక్షకు బదులుగా న్యాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ వ్యవస్థగా మారిందన్నారు. చట్టాలు అమలు చేసే ముందు సంప్రదింపులు జరపలేదని విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో ఈ చట్టాలపై చర్చించినంతగా ఏ అంశంపైనా చర్చ జరగలేదు. నేను 118 సార్లు సమావేశాలకు హాజరయ్యా. మొత్తంగా30 గంటలపాటు చర్చలు జరిగాయి. అందులో 34 మంది సభ్యులు పాల్గొన్నారు’ అని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో మొత్తం వ్యవస్థ పురోగమనం పొందుతుందని, ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి, తీర్పు వెల్లడయ్యే వరకు మొత్తం సాంకేతికతతోనే పని చేస్తుందని తెలిపారు.మరోవైపు పాక్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కొత్త క్రిమినల్ చట్టాలు పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని జమ్మూ కశ్మీర్ ఏడీజీపీ అభిప్రాయపడ్డారు.

బుల్డోజర్ న్యాయాన్ని సహించం: ఖర్గే

లోక్‌సభలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత మూడు కొత్త క్రిమినల్ చట్టాలను బలవంతంగా ఆమోదించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దేశ పార్లమెంటరీ వ్యవస్థలోబుల్‌డోజర్ న్యాయం ప్రబలడానికి ఇండియా కూటమి అనుమతించబోదని నొక్కి చెప్పారు. ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోడీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీలను సస్పెండ్ చేసి ఈ చట్టాలను ఆమోదించారన్నది మాత్రమే అసలు నిజమని తెలిపారు.

Next Story

Most Viewed