రాజ్యసభలో ఖర్గె వర్సెస్ నడ్డా

by S Gopi |
రాజ్యసభలో ఖర్గె వర్సెస్ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గె, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. గతంలోనూ, ఇప్పుడూ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు అనుమతించడంలేదని ఫిర్యాదు చేస్తూ, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఖర్గె.. రాబోయే మూడున్నరేళ్లు(ఆయన పదవీకాలం గడువును గుర్తుచేస్తూ) సత్యం వైపు ఉండాలని కోరారు. గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి, తానొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. గత ఏడాదిన్నర కాలంలో మీరు పార్లమెంట్‌లో చూసినవి గుర్తించుకుని, వచ్చే మూడున్నరేళ్లలో ఖచ్చితంగా సత్యం వైపు ఉండాని అన్నారు. దీనికి సరదాగా బదులిచ్చిన జగదీప్ ధన్‌ఖడ్, తాను ఎప్పుడూ సత్యం వైపే ఉంటానని అన్నారు. అయితే, ఈ సందర్భంలో ఖర్గె వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. నా భావన తప్పే కావొచ్చు.. కానీ వచ్చే మూడున్నరేళ్ల పాటు సభలో సత్యంవైపు ఉండాలని అడగడం, గత ఒకటిన్నర ఏడాదిగా అలా లేరని చెప్పడం ఖర్గె ఉద్దేశంలా ఉందని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. అదికూడా ప్రతిపక్ష నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదమ్యోగ్యం కాదని నడ్డా ఘాటుగా బదులిచ్చారు.

ధన్‌ఖడ్, ఖర్గె మధ్య సరదా సభాషణ..

మరోవైపు, గతవారం జగదీప్‌ ధన్‌ఖడ్‌, మల్లికార్జున ఖర్గేల మధ్య జరిగిన ఘాటు సంభాషణ తర్వాత వారి మధ్య సోమవారం కొద్దిసేపు సరదా చర్చ జరిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు లేచిన ఖర్గె.. తనకు మోకాళ్ల నొప్పుల వల్ల ఎక్కువసేపు నిలబడలేనని, ఛైర్మన్ అనుమతిస్తే కూర్చుంటానని అన్నారు. దానిపై స్పందించిన జగదీప్.. సభలో ప్రసంగించే సమయంలో మీ సౌకర్యం చూసుకోండి. ఆ నిర్ణయం మీదేనని అన్నారు. దానికి బదులిచ్చిన ఖర్గె నవ్వుతూ.. కూర్చుని చేసే ప్రసంగం కంటే నిలబడి మాట్లాడటమే సమర్థవంతంగా ఉంటుందని వాతావరణాన్ని సరదాగా మార్చారు. ఈ విషయంలో మీకు నేను సహాయం చేస్తానని జగదీప్ అన్నారు. దానికి కొన్నిసార్లు మీరు మాకు సహాయం చేసారు. దాన్ని గుర్తించుకుంటామని ఖర్గె అనడంతో రాజ్యసభ ఛైర్మన్ నవ్వారు.

పలు దేశాధినేతలకు నివాళులు..

కాగా, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇటీవల మరణించిన ఇరాన్, మలావి, టాంజానియా దేశాల నేతల మరణాలకు రాజ్యసభ నివాళులు అర్పించింది. ఆయా దేశాల అధినేతలకు హృదయపూర్వకంగా సంతాపం తెలియజేస్తున్నామని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు.

Next Story

Most Viewed