ఫెయిల్యూర్ పైప్ లైన్..

by Sumithra |
ఫెయిల్యూర్ పైప్ లైన్..
X

దిశ, మంచిర్యాల : ఫెయిల్యూర్ పైప్ లైన్ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కింద కడెం చివరి ఆయకట్టు రైతులను కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు పగిలిపోయి సాగునీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. తరచూ పైప్లైన్ పగిలిపోతూ సాగునీటి సరఫరా అంతరాయంతో ఇప్పటికే చాలా మటుకు చివరి పంటపొలాలు ఎండిపోయి రైతులను కష్టాలకు గురిచేస్తోంది. లిఫ్ట్ పై ఆశలు పెట్టుకొని ఈ యాసంగిలో వరి పంట వేసిన రైతుల్లో ఈ సారి దిగుబడిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

లిఫ్ట్ కి చేసి నాసిరకం పైపులతోనే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, లిఫ్ట్ కి ఉన్న నాసిరకం పైపులను తొలగించి నాణ్యత గల పైపులను వేయాలని విపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగి సీజన్ పూర్తి కాగానే ప్రస్తుతం ఉన్న జీఆర్పీ పైపులను తొలగించి వాటి స్థానంలో ఎమ్మెస్ పైపులు వేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు తగుప్రణాళికను రూపొందించడంలో నిమగ్నమయ్యారు.

ఇదీ పరిస్థితి..

కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకి సాగునీటి ఇబ్బందులు దూరం చేయాలని సంకల్పంతో దండేపల్లి మండలంలోని గూడెం గ్రామ గోదావరి వద్ద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్మించారు. ఇక్కడ నిర్మించిన పంప్ హౌస్ నుంచి తానిమడుగు వరకు 12.01 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి కడెం ప్రధాన కాల్వకు అనుసంధానం చేశారు. అక్కడ ఈ లిఫ్ట్ నీటిని ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసి కడెం చివరి ఆయకట్టున ఉన్న లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాలోని సుమారు 30వేల ఎకరాలకు సాగునీటిని అందించడం దీని ప్రధాన ఉద్దేశం. 2008లో లిఫ్ట్ పనులు ప్రారంభం కాగా, 2015లో పూర్తయ్యి సాగునీటి సరఫరా మొదలైంది. మూడు టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి వానాకాలం, యాసంగి సీజన్ లలో తరచూ పైపులు పగిలిపోయి సాగునీటికి సరఫరాకి అంతరాయం ఏర్పడుతోంది.

అయితే లిఫ్ట్ కి సాగునీటి సరఫరా ఒత్తిడిని తట్టుకునే నాణ్యమైన ఎమ్మెస్ పైపులు వాడాల్సి ఉండగా, నాసిరకమైన జీఆర్పీ పైపులు వేసారనే ఆరోపణ వ్యక్తమవుతున్నాయి. లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి రెండు మోటార్ల ద్వారా సాగునీటిని విడుదల చేసినప్పుడల్లా జీఆర్పీ పైపులు సాగునీటి సరఫరా ఒత్తిడిని తట్టుకోలేక తరచూ పగిలిపోయి సాగునీటి సరఫరాకు ఆటంకాలేర్పడుతున్నాయి. లిఫ్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థతో అధికార పార్టీ ప్రతినిధులు కమీషన్ల కోసం నాసిరకమైన జీఆర్పీ పైపులు వేయించారని విపక్ష పార్టీల నాయకులు మండి పడుతున్నారు. పైప్ లైన్ పగిలిపోయిన ప్రతిసారి మరమ్మతులు పూర్తిచేసే వరకల్లా నాలుగైదు రోజులకి పైగానే సమయం పడుతోంది. ఈలోగా పంటలకు సరిపడా నీరందక చివరి భూములు ఎండిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి.

అధికారులు ఏం చేస్తున్నారు..

ఈ యాసంగి సీజన్ పూర్తికాగానే పాత పైపుల స్థానంలో సాగునీటి సరఫరా ఒత్తిడిని తట్టుకునే ఎమ్మెస్ పైపులు వేయాలని సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఉన్న జీఆర్పీ లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి తానిమడుగు వరకు 12.01 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ విస్తరించి ఉంది. అయితే ఈ కొత్త పైప్ లైన్ వేస్తే కిలోమీటర్ కి సుమారు రూ.12 కోట్ల వ్యయం కాగలదని, మొత్తంగా 12. 01 కిలోమీటర్ల దూరం వరకు జీఎస్టీతో కలిపి రూ.180కోట్లు ఖర్చవుతుందని అంచనాకు వచ్చారు. కాగా, అంత బడ్జెట్ కేటాయింపులు లేనందున వచ్చే వానాకాలం పంట సీజన్ ప్రారంభం కల్లా ఎలాగైనా ఎమ్మెస్ పైపులు వేసి సాగునీటి సరఫరా ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనకు నీటిపారుదల శాఖ అధికారులు పదును పెడుతున్నారు.

కొత్తగూడెం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయి ఉన్నందున అక్కడి ఎమ్మెస్ పైపులను ఇక్కడికి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పైపులు సిద్ధంగా ఉన్నందున ట్రాన్స్ పోర్ట్, మరమ్మతులకు మాత్రమే వ్యయం కాగలదని, సుమారు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్లలోపు తక్కువ బడ్జెట్ తో పైప్ లైన్ పనులను పూర్తి చేయించవచ్చనే యోచనలో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారుల ఆలోచనకు తగ్గ ప్రణాళిక రూపకల్పనకు కార్యరూపం దాల్చితే ఈ యాసంగి పంటకాలం పూర్తి కాగానే కొత్త పైప్లైన్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed