- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్టలు గుల్ల.. ప్రభుత్వాదాయానికి భారీగా గండి..
దిశ, లక్షెట్టిపేట : గుట్టలు కనిపిస్తే చాలు.. అక్రమార్కులు గుట్టను కాస్త స్వాహా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ప్రకృతి సంపదని కొల్లగొడుతున్నారు. ఫిర్యాదులు వెళ్తేనే మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతోనే ప్రభుత్వదాయానికి భారీగా గండి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల అక్రమార్జనకు లక్షెట్టిపేట మండలంలోని గుట్టలు కరిగిపోతున్నా.. ఆ వైపుగా చర్యలు చేపట్టడంలో అధికారులు దృష్టి సారించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరుగుతోంది..
మండలంలోని పోతపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 138లో 7.31ఎకరాల ఇనాం భూములు, సర్వే నెంబర్ 109లో 10.10 ఎకరాల పట్టాభూములు ఉన్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో మంచిర్యాలకు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఆ భూముల్లో క్రషర్ ని ఏర్పాటుచేసి మొరం, బండరాలు తవ్వకాలు చేస్తోంది.
గత నాలుగైదేళ్లుగా ఎలాంటి అనుమతులు పొందకుండా ఈ దందా చేస్తుండడంతో అక్కడ ఉన్న రెండు గుట్టలు దాదాపుగా కరిగిపోయాయి. పక్కనే ఉన్న మరో గుట్టకు ఎసరు పెట్టే యత్నాలు జరుగుతున్నాయి. లక్షెట్టిపేట నుంచి మంచిర్యాలకు వెళ్లే 63వ నెంబర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలోనే ఈ అక్రమ క్రషర్ తో మొరం, బండరాళ్ల తవ్వకాలు నడుస్తున్నా.. అధికారుల దృష్టిలో పడకపోవడం గమనార్హం. అక్రమక్రషర్ నిర్వహణతో పేలుడు పదార్థాలతో డ్రిల్లింగ్ చేసినప్పుడల్లా దుమ్ము, ధూళి, చిన్నచిన్న బండారాళ్ల ముక్కలు చుట్టుపక్కల రైతుల పొలాల్లో పడుతూ పనులకు ఆటంకం కలిగిస్తోంది. దీన్ని భరించలేని గ్రామస్తులు, రైతులు ఈ నెల 21న అక్రమక్రషర్ వద్ద ఆందోళనకు దిగడంతో మైనింగ్, రెవెన్యూ అధికారుల్లో చలనం ప్రారంభమైంది.
ఘటనా స్థలానికి చేరుకుని డ్రిల్లింగ్ ట్రాక్టర్, రెండు జేసీబీలను, రెండు టిప్పర్లను సీజ్ చేశారు. గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగితేనే తప్ప, అధికారులు స్పందించలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని మోదెల శివారులో ఉన్న గువ్వలగుట్ట సైతం రానురానూ గుల్లవుతోంది. ఈ గుట్టలో కూడా అక్రమంగా తవ్వకాలు జరిపి అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా మొరం మట్టిని తరలించడంతో గుట్ట కనుమరుగాయ్యే పరిస్థితికి చేరువవుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా, అనుమతులు పొందకుండా రూ.లక్షల్లో అక్రమార్కులు ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. తద్వారా అక్రమ సంపాదన పొందుతున్నారు.
కార్యదర్శి, వీఆర్ఏలు ఏం చేస్తున్నారు...?
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏలు ఉన్నారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిగినా మండల, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం వారి విధిధర్మం. కానీ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు అక్రమమైనింగ్ తవ్వకాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమార్కులు బయట ఒక్కో ట్రాక్టర్ బండరాళ్ల ట్రిప్పుకు రూ. 1800 నుంచి రూ.2వేల వరకు, ఒక్కొక్క టిప్పర్ ట్రిప్పుకు రూ. 5వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదే మొరం మట్టికి ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పు కి రూ. 600 నుంచి రూ. 800 వరకు అమ్ముకుని అక్రమ సంపాదన చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ క్రషర్ల పై మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దృష్టికి వస్తే చర్యలు చేపడుతున్నాం : బాలు, మైనింగ్ శాఖ ఏడి, మంచిర్యాల
ఎక్కడైనా అనుమతులు లేకుండా మొరం, కంకర, బండరాళ్ళ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు చేపడుతున్నామన్నారు. కాగా, అంకతిపల్లిలో పట్టాభూముల్లో భూమి చదును కోసం తవ్వకాలు చేస్తున్నారు. జీవో నెంబర్ 139 ప్రకారం పట్టా భూముల్లో రైతులు భూమి చదువు కోసం తవ్వకాలు చేపట్టవచ్చు. అయితే అక్కడ పేలుడు పదార్థాలతో తవ్వకాలు చేస్తే అది తమ పరిధిలో లేదన్నారు. పోలీసులు పరిధిలోకి వస్తుందన్నారు.