లక్ష్యసాధనకు మిగిలింది 47 రోజులే..

by Sumithra |   ( Updated:2023-02-13 13:39:51.0  )
లక్ష్యసాధనకు మిగిలింది 47 రోజులే..
X

దిశ, మందమర్రి : 2022-23 ఆర్థిక సంవత్సరం సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు ఇక మిగిలింది 47 రోజులేనని సింగరేణి డైరెక్టర్లు ఎన్ బలరాం, డి సత్యనారాయణ, ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్ రెడ్డిలు అన్నారు. సోమవారం సింగరేణి వ్యాప్తంగా పలువురు జీఎంలు ముఖ్య అధికారులతో వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధన వివరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం ప్రతీరోజూ 2.3 లక్షల టన్నులకు బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా చేయాలని వారు కోరారు.

ఇందుకోసం ఏరియా జీఎంలు ప్రణాళికాబద్ధంగా కార్మికులు యూనియన్ నాయకులతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 47 రోజుల్లో ప్రతీనిమిషం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మూడు బదిలీలలో షిఫ్టుల వారీగా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తే సింగరేణి చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు, టర్నోవర్ ను సాధించిన ఘనత సంస్థకు దక్కుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత ఆశాజనకంగా ఉందని చెప్పారు. ఇక రోజుకు 2.30 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ ఉపరితల ధర్నాలో మట్టితొలగింపునకు కాంట్రాక్టర్లను నియమించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏరియాల వారీగా ప్రతీ జీఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు, మేనేజర్లతో సమీక్షలు నిర్వహించుకొని రోజుకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలు చేరుకోవడం ద్వారా గనుల్లో బొగ్గు వెలికితీతకు అవకాశాలు మెరుగవుతాయన్నారు. బొగ్గు రవాణాకు కీలకమైన సీ.హెచ్.పి.ల మెయింటనెన్సు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. ఏరియా ఉత్పత్తి లక్ష్యసాధనలో ఇబ్బందులు ఎదురైతే సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్, ఐ.ఈ.డి. (డీజీఎం) రాజన్న, కేకే ఓసి ప్రాజెక్ట్ అధికారి రమేష్, హెచ్వోడి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed