తనిఖీలు సరే.. వైద్యులేరి మరి..?

by Aamani |
తనిఖీలు సరే.. వైద్యులేరి మరి..?
X

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వైద్య విభాగాలను పరిశీలించారు. ఓపీ,డయాలసిస్, ఫార్మసీ ఇతర విభాగాలను ఎమ్మెల్యే వినోద్ విజిట్ చేశారు. వైద్య సేవలు తీరు, మందుల అందుబాటు, రోగుల సంఖ్య వివరాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆసుపత్రి సూపర్డెంట్ రవికుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు.

పెద్ద ఆస్పత్రిలో వైద్యుల కొరతేంటీ..?

బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రం గా వెలసిన వంద పడకల ఆసుపత్రిలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆస్పత్రి స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు,వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు కొరవడుతున్నాయి. 38 మంది వైద్యులకు గాను 8 మంది, ఆరుగురు గైనకాలజిస్టులకు ఒకరు, పిల్లల వైద్యులు ఒకరు, నర్సుల కొరత మరి తీవ్రంగా ఉంది. ఇలా అరకొరగా వైద్యుల సేవలో ఆసుపత్రి కొనసాగుతుంది.

వైద్య నిపుణుల ఊసే లేదు..

వంద పడకల ఆసుపత్రిలో కనీసం వైద్య సేవలకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. దీంతో ఇక్కడ ఏ స్థాయిలో వైద్య సేవలు ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. వైద్య నిపుణుల కొరత తినకుండా పోతుంది. ఫిజీషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్ ల వైద్యుల సేవలు ఇక్కడ గగనమైపోయాయి. ఆసుపత్రిలో ఆరుగురు గైనకాలజిస్ట్ లకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైద్య నిపుణుల కొరత తో మెరుగైన వైద్య సేవలు బెల్లంపల్లి ఆసుపత్రిలో కరువయ్యాయి. అరకొరగా ఉన్న వైద్యులు,వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో తమ సేవలను నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సూపర్డెంట్ రవికుమార్ పర్యవేక్షణలో అందుబాటులో ఉన్న వైద్య సేవలతో రోగులకు ఈ మాత్రం వైద్యం అందుతోంది.

ఆస్పత్రిలో వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే పలుమార్లు సూపర్డెంట్ రవికుమార్ జిల్లా వైద్యాధికారులు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు నివేదించారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి పురోగతి కానరావడం లేదు. అంతంత మాత్రంగానే ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలను తనిఖీలు చేయడం తోనే సరిపోదు. వైద్య సేవలను అభివృద్ధి చేయాలని ప్రజలు ఎమ్మెల్యేను కోరుతున్నారు. వైద్య నిపుణుల ఖాళీ పోస్టుల భర్తీపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలోని మౌలిక వైద్య సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వైద్యుల సిబ్బంది కొరతను తీర్చి సేవలను మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు.

Next Story

Most Viewed