ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో నువ్వా నేనా..?

by Javid Pasha |
ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో నువ్వా నేనా..?
X

దిశ, ప్రతినిధి నిర్మల్: పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి 2014లో ఎంపీగా గెలుపొందిన జీ నగేష్ 2019 బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు ఓటమి చవి చూశారు. ప్రస్తుతం ఆదిలాబాద్ స్థానం బీజేపీ ఖాతాలో ఉండగా వచ్చే ఎన్నికల్లోను అదే ఊపుతో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ధీమాతో ఉంది. కాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు సిద్ధపడుతున్నారు

ఎంపీ సీటుపై కన్నేసిన ఉద్యోగ సంఘాల నేత శ్యామ్ నాయక్

ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు గెజిటెడ్ అధికారుల సంఘం నేత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త అజ్మీర శ్యామ్ నాయక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సుదీర్ఘకాలం ఆదిలాబాద్ జిల్లాలో ఆయన వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఖానాపూర్ నిర్మల్ నియోజకవర్గం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్న ఆశయంతో ఆయన కొన్నాళ్లుగా అన్ని వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నారు. సామాజిక కార్యక్రమాలతో పాటు ఉద్యోగ సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా... ఆయన మాత్రం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం.

మాజీ ఎంపీ జీ నగేష్ అనాసక్తి.. బోథ్ ఎమ్మెల్యే సీటుపై గురి

మాజీ ఎంపీ జీ నగేష్ ఈసారి బోత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఆ నియోజకవర్గం నుంచి పలుసార్లు గెలుపొందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 2014కు ముందు టీఆర్ఎస్ లో చేరిన ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో ఓడిపోయారు. అప్పటినుంచి గత పార్లమెంటు పరిధిలో ఉన్న సెగ్మెంట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. తన సొంత నియోజకవర్గం బోథ్ లో మాత్రం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. దీన్నిబట్టి ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వైరం పెంచుకొని గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది.

ఛాన్స్ కోసం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి ప్రయత్నం..

కాగా అదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 2014లో ఆమె ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓడిపోగా... ఆ తర్వాత జరిగిన జెడ్పీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ చైర్పర్సన్ గా విజయం సాధించారు. అప్పటి నుంచి మళ్లీ ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని ఆమె అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.

తెరపైకి జాన్సన్ నాయక్ పేరు..

జగిత్యాల జిల్లాకు చెందిన జాన్సన్ నాయక్ పేరు కూడా కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. మంత్రి కేటీఆర్ అనుచరుడిగా ఆయన బరిలో ఉంటారని ప్రచారం మొదలైంది. పార్లమెంటు స్థానంలో ఇప్పటివరకు ఆయన ప్రచారం మొదలు పెట్టకపోయినప్పటికీ అవకాశం వస్తే వేచి చూసే ధోరణిలో ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలోనే ఆయన ఆదిలాబాద్ ఎంపీ గా పోటీ చేయాలని ప్రయత్నించారు. అప్పుడు కేటీఆర్ సూచన మేరకు బరిలో నుంచి తప్పుకున్నారని ప్రచారం ఉంది. తాజాగా ఆయన పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed