తీసికట్టుగా గొలుసు కట్టు..ఆందోళన చెందుతున్న రైతులు

by Aamani |
తీసికట్టుగా గొలుసు కట్టు..ఆందోళన చెందుతున్న రైతులు
X

దిశ,లక్షెట్టిపేట: గొలుసు కట్టు చెరువుల కింద కట్టు(వరద)కాలువలు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. పాలకులు మారినా, అధికారులు మారుతున్నా వాటిపై దృష్టి సారించకపోవడంతో ఆక్రమణలకు సైతం గురవుతున్నాయి. నిజాం కాలంలో వరద నీరు వృధాగా పోకుండా ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లేలా గొలుసుకట్టు విధానం ద్వారా అనుసంధానంతో కాల్వల నిర్మాణం చేపట్టి చెరువుల కింద ఆయకట్టును స్థిరీకరించారు. చక్కటి ప్రణాళికతో ఏర్పాటు చేసిన ఆ కాలువలు లక్షెట్టిపేట మండలంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం తో ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీనికి తోడు కాలువలు ఆక్రమణకు గురవుతుండటంతో గొలుసు కట్టు చెరువుల కింద సాగు ప్రశ్నార్థకం గా మారుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఇది గొలుసు కట్టు..

మండలంలోని చల్లంపేట అటవీ ప్రాంతం గుండా ప్రవహించే దొనబండ వాగు నుంచి వరద నీరు వృధాగా వెళ్లకుండా అక్కడ నిజాం కాలంలో పెద్ద మత్తడిని నిర్మించారు. అక్కడి నుంచి గొలుసుకట్టుగా వరద నీరు ఒక చెరువు నిండిన తర్వాత ఆ చెరువు మత్తడి(అలుగు) నుంచి మరో చెరువుకి వెళ్లేలా వాటి కింద కట్టు కాలువలు ఏర్పాటు చేశారు. దొనబండ వాగు మత్తడి నుంచి దౌడేపల్లి గ్రామంలోని రావికుంట, పెద్ద చెరువులకు, చల్లంపేట శివారులోని చింతలకుంట, చందారం గ్రామంలోని హనుమంత పల్లి చెరువుకు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి చెరువుకు, గంపలపల్లి చెరువు నుంచి ఇటిక్యాల, బొట్లకుంట చెరువుకు కట్టు కాలువల ద్వారా వరద నీరు చేరుతుంది. ఈ చెరువుల కింద సుమారు 5 వేల ఎకరాల వరకు ప్రతి యేటా వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయకట్టు సాగవుతోంది. అయితే సాగునీటి ఇబ్బందులను తీరుస్తున్న ఈ కాలువలు మరమ్మత్తులకు సైతం నోచుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన కాలువలు కావడంతో వరదలకు కాలువ గట్లు బలహీనంగా మారి పోతున్నాయి. వర్షాకాలం వస్తే చాలు చందారం చెరువు కట్టు కాలువ గట్టు బలహీనంగా ఉండటం తో అక్కడక్కడ గండ్లు పడి సాగునీరు వృధాగా పోతున్న సందర్భాలు ఉన్నాయి.

రూ.లక్షల్లో డిమాండ్.. కాలువల ఆక్రమణ..

గంపలపల్లి చెరువు మత్తడి నుంచి ఇటిక్యాల, బొట్ల కుంట చెరువు లకు వరద నీటిని చేరవేసే కట్టు కాలువలు ఆక్రమణదారుల బారిన పడుతున్నాయి. ఈ కాలువలు వెంట ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. గుంటకు రూ.లక్షల్లో డిమాండ్ పలుకుతోంది. దీంతో రియల్టర్లు తమ వెంచర్లల పక్కన ఉన్న కాల్వల గట్లను ధ్వంసం చేసి తమ వెంచర్లలో కలుపుకొని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. గుంటకు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల పైగా ధర పలుకుతోంది. ఈ కాలువల్లో మట్టి నింపుతూ చెరువులకు నీరు చేరకుండా చేస్తుండడంతో వరద నీరు సమీప కాలనీల్లోకి వెళుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఊత్కూరు చౌరస్తా సమీపంలోని గురునానక్ ఫంక్షన్ హాల్ వద్ద ఇటిక్యాల చెరువుకు వెళ్లే కాలువను ఓ వెంచర్ నిర్వాహకుడు కాలువను ఆక్రమించగా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆక్రమణలు తొలగించారు.

అయిన ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఫిర్యాదులు వెళితేనే అధికారులు స్పందిస్తున్నారని, లేకపోతే కాలువల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గంపలపల్లి చెరువు నుంచి లక్షెట్టిపేట లోని బొట్లకుంట చెరువుకు వెళ్లే కట్టుకాల్వ ఆక్రమణలతో ఉనికే లేకుండా పోతోంది. కాల్వ పక్కన భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు ఆ కాల్వలో మొరం మట్టి నింపుతూ తమ వెంచర్లలో కలుపుకుంటున్నారు. ఇటిక్యాల, బొట్లకుంట చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో రియల్టర్లు వెంచర్లు వేసి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయకట్టుదారులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జల వనరులైన చెరువులకు నీటిని చేరవేసే కట్టు కాల్వలు సైతం ఆక్రమణలకు గురవుతుండటంతో వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువు లతోపాటు కట్టు కాలువల పైన దృష్టి సారించి వాటిని పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed