కలెక్టర్ చెప్పినా తహసీల్దార్ ఖాతర్ సేస్తలేడు..!

by Sumithra |   ( Updated:2023-03-10 17:21:44.0  )
కలెక్టర్ చెప్పినా తహసీల్దార్ ఖాతర్ సేస్తలేడు..!
X

దిశ, మందమర్రి : మంచిర్యాల జిల్లా కలెక్టర్ సెప్పిన మందమర్రి తహసీల్దార్ ఖాదర్ చేస్తలేడు..! మూడు ఏండ్లుగా తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాం మా ముఖం చూసినోళ్లు లేకపాయే. అయ్యా చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ మాకు న్యాయం చేపించు తండ్రి సచ్చి నీ కడుపున పుడతాం బాంచన్... అంటూ మందమర్రి మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయం ముందు ఊరు మందమర్రికి చెందిన బూనేని (మేకల) జామున, పోసక్క, ఎల్లక్కలు కంటనీరు పెట్టుకుని కనపడ్డ వారికి గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

మాది ఊరు మందమర్రి మా తాత బూనేని (మేకల) ఎర్రయ్యకు మందమర్రి శివారు సర్వే నంబరు 99, 130, 131 లో భూమి ఉందని తెలిపారు. కాగా ఎర్రయ్యకు పోశం, రాజం, మల్లయ్య, చిన్నయ్య అనే నలుగురు కుమారులు జన్మించారని వివరించారు. మా సర్వే నంబర్ల నుండి 10 గుంటల భూమి జాతీయ రహదారి నంబర్ 363 విస్తీర్ణంలో నష్టపోతున్నామని చెప్పారు. అయితే మొదటగా అధికారులు రెవెన్యూ రికార్డులను పరిశీలించకుండా మా భూమికి సంబంధం లేని నకిరకొమ్ముల నిరంజన్, ఉప్పలంచి మురారి అనే వైశ్యులకు (అవార్డు ప్రొసీడింగ్) నష్టపరిహారం జారీ చేయడం జరిగిందని వాపోయారు.

ఈ విషయం మాకు తెలియగానే నవంబరు 2020 నుండి మందమర్రి తాసిల్దార్ కు నాలుగు సార్లు మూడు సర్వే నంబర్లలో మేము నలుగురం వాటాదారుడుగా మండల రెవెన్యూ రికార్డుకు ఉన్నామని వచ్చిన పరిహారాన్ని నాలుగు వాటాలుగా ఇవ్వాలని తాము విన్నవించుకున్నామని పేర్కొన్నారు. కానీ స్థానిక అధికారులు మా భూమి రికార్డును, వినతులను పరిశీలించకుండా బూనేని (మేకల) చిన్నయ్య వారసులకు మాత్రమే మొత్తం పరిహారం వచ్చేలా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారని రోధిస్తూ చెప్పారు. నలుగురం వాటాదారులుగా రికార్డుకు ఉంటే ఒక వాటాదారుని వారసులకు మాత్రమే ఎలా పరిహారం ఇస్తారని వారు ప్రశ్నించారు. ఇందులో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది హస్తం ఉందని వారు ఆరోపించారు.

మాకు జరిగిన అన్యాయం గురించి 23 నవంబర్ 2022 నాడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నెల రోజులలో ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ తాసిల్దార్ ను ఆదేశించారని తెలిపారు. మూడు నెలలుగా మందమర్రి తాసిల్దార్ కార్యాలయానికి వచ్చి అయ్యా మా సమస్య చూడండ్రి అని కాగితాలిత్తే గీర్దావరి దగ్గరికి వెళ్ళు అని తాసిల్దారు అంటే గీర్దావరి తాసిల్దార్ దగ్గరికి వెళ్ళని మమ్ములను గోసపెడుతున్నారని వాపోయారు. సారు మొగదిక్కు లేని వాళ్ళం జరా కనుకరించున్రు అని వారు వేడుకుంటున్నారు. ఈ విషయమై మందమర్రి తాసిల్దార్ సంపత్ శ్రీనివాస్ కు చరవాణిలో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed