ఎన్నికల నియమావళి అమలు.. బ్యాంక్ అధికారుల సమావేశంలో కలెక్టర్ కీలక ఆదేశాలు

by Vinod kumar |
ఎన్నికల నియమావళి అమలు.. బ్యాంక్ అధికారుల సమావేశంలో కలెక్టర్ కీలక ఆదేశాలు
X

దిశ, నస్పూర్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున మంచిర్యాల జిల్లాలో ప్రజలు 50 వేల రూపాయలకు మించి నగదు తమ వెంట తీసుకెళ్లరాదని, ఒకవేళ అత్యవసర పరిస్థితులలో తీసుకెళ్లాల్సివస్తే తగిన ఆధారాలు కలిగి ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోగల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున అధికారులు ఎన్నికల నిబంధనలకు లోబడి పని చేయాలని తెలిపారు. అనుమానాస్పదంగా, అసాధారణంగా గత రెండు, మూడు నెలల నుంచి నగదు జమ, తీసుకోవడం లేని బ్యాంకు ఖాతాలో ఒక లక్ష రూపాయలు అంతకుమించి నగదు జమ చేయడం, తీసుకోవడం జరిగినట్లయితే సంబంధిత ఖాతా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు.

ఒక ఖాతా నుంచి ఎక్కువ ఖాతాలకు నగదు బదిలీ చేసిన, చాలా ఖాతాల నుండి ఒకే ఖాతాకు నగదు బదిలీ అయిన వెంటనే సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఖాతాలో నగదు జమ చేసిన, నగదు తీసుకున్న అట్టి వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని, ఒక లక్ష రూపాయలు అంతకుమించి నగదు తీసుకున్న, జమ చేసిన రాజకీయ పార్టీల వివరాలు తెలియజేయాలని తెలిపారు. సాధారణ ప్రజలు తమ బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు, అంతకుమించి నగదు జమ చేసిన, తీసుకున్న వివరాలను సంబంధిత శాఖ నోడల్ అధికారికి తెలియజేయాలని తెలిపారు.

ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు తన ఎన్నికల వ్యయం కొరకు ప్రత్యేకంగా ఒక ఖాతా తెరవాలని, ఇట్టి ఖాతాను అభ్యర్థిగా స్వతహాగా, సంయుక్త ఎన్నికల ఏజెంట్‌తో కలిసి తెరవాలని, అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఖాతా తెరవాలని తెలిపారు. అభ్యర్థి తన ఎన్నికల వ్యయాన్ని నెట్ ద్వారా, ఆర్.టి.జి.ఎస్, నెఫ్ట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చని, నగదు ఎన్నికల సమయంలో 20 వేలకు మించి అట్టి ఖాతా నుండి ఇవ్వరాదని, బ్యాంక్ అధికారులు అభ్యర్థులకు కావలసిన సహాయాన్ని త్వరగా అందించాలని తెలిపారు. బ్యాంకులో నగదు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లే సమయంలో తప్పనిసరిగా సరైన డాక్యుమెంట్లు ఉండే విధంగా చూసుకోవాలని, నగదు తరలించేవారు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, నగదు సరఫరా చేస్తే ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్, అవుట్సోర్సింగ్ కంపెనీస్ బ్యాంకు సంబంధిత నగదు కాకుండా ఏ ఇతర వ్యక్తులు నగదు సరఫరా చేయరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారులు, వివిధ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed