- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేషన్ బియ్యం దందా.. కార్డుదారుల నుంచి కొని కమీషన్కు అమ్మకాలు..
దిశ, లక్షెట్టిపేట : రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. మంచిర్యాల జిల్లాలో రేషన్ డీలర్లు, దళారుల ఇష్టారాజ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా, అక్రమార్కుల దందాతో వ్యవస్థ నీరుగారిపోతోంది. కరోనా కాలం నుంచి రేషన్ బియ్యం పేదలకు ఉచితంగా పంపిణీ అవుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి దళారులు కిలోకి రూ. 10 నుంచి రూ. 12 కొనుగోలు చేసి రూ.4 నుంచి రూ. 5 కమీషన్కు బియ్యం వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకుని దందా సాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కొందరు డీలర్లు తమ షాపుల వద్ద ఈ పాస్ విధానం బయోమెట్రిక్పై కార్డుదారులు వేలిముద్రలు వేయగానే వారి వద్ద నుంచి నగదుకు బియ్యాన్ని కొనుగోలు చేసి వ్యాపారులకు కమీషన్ చూసుకొని అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు టన్నుల కొద్ది తరలిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో ప్రతి నెలా ఏదో ఒకచోట అక్రమ రేషన్ బియ్యం పట్టుబడుతుండడం గమనార్హం. ఓవైపు దళారులు, మరోవైపు డీలర్లు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దాటుతున్న సరిహద్దులు..
మంచిర్యాల జిల్లాలో 423 రేషన్ దుకాణాలు ఉండగా, ఆహార భద్రత కార్డులు 1,98,649, అంత్యోదయ కార్డులు 15,417, అన్నపూర్ణ కార్డులు 170 ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతినెల 9 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కార్డుదారులకు పంపిణీ అవుతోంది. రేషన్ కార్డు దారుల్లో అనర్హత కలిగిన వారు కూడా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రేషన్ కార్డు అన్ని రకాల బహుళ ప్రయోజనకారి కావడంతో నిరుపేదలతో పాటు కొందరు అదే మార్గాలు ఉన్నవారికి కూడా రేషన్ కార్డు ఉండడంతో రేషన్ బియ్యం పొందుతున్నారు. రేషన్ బియ్యం అవసరం లేకపోయినా.. కార్డు రద్దు కాకుండా ఉండేందుకు రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. అలాంటి వారి నుంచి దళారులు, డీలర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కమీషన్ కి వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకుంటూ దందా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు క్వింటాళ్ల కొద్ది బియ్యం కాగానే మహారాష్ట్రకు తరలిస్తున్నారని సమాచారం. మరి కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి కోళ్ల దాణాకు విక్రయిస్తున్నారని తెలుస్తున్నది.
ఆగని అక్రమ రవాణా..
జిల్లాలో ఈనెల 11న దండేపల్లి మండలం నంబాల గ్రామం నుంచి మినీ వ్యాన్ లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండగా గూడెం గ్రామంలో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈనెల 5న జైపూర్ లో 20 క్వింటాళ్ల, ఈనెల 6న మంచిర్యాల 5 క్వింటాళ్లు, గత నెల 9న రామకృష్ణాపూర్ 26 క్వింటాళ్ల, 10న కన్నెపల్లి మండలం వెంకటాపూర్లో 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో పట్టుబడింది. జిల్లాలో ప్రతినెల మూడు నాలుగు చోట్ల నైనా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడుతుండంతో ఏ మేరకు రేషన్ బియ్యం పక్క పడుతున్నదో అర్థమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారుల సహకారం తో ప్రజా పంపిణీ వ్యవస్థ పై నిరంతర నిఘాను పెంచితే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.