Gautam Adani: అదానీపై అమెరికాలో కేసు..మరోసారి తెరపైకి వ్చచిన జేపీసీ

by Shamantha N |
Gautam Adani: అదానీపై అమెరికాలో కేసు..మరోసారి తెరపైకి వ్చచిన జేపీసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీ (Gautam Adani)పై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. కాగా.. అదానీ గ్రూప్‌ (Adani group)పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ‘మోదానీ’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటుచేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్‌ చేస్తున్నామంది. ‘హమ్‌ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు అడిగామని, ఇంతవరకు సమాధానం రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అదానీ గ్రూప్ సెక్యూరిటీలు, ఇతర చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్న సెబీ వైఫల్యాన్ని ఇది మరోసారి ఎత్తిచూపిందన్నారు. అదానీ గ్రూప్ పెట్టుబడుల మూలాలు, షెల్ కంపెనీలు మొదలైన వాటిపై సమూహాన్ని జవాబుదారీగా ఉంచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అదానీ మెగా కుంభకోణంలో సెక్యూరిటీస్ చట్ట ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు కొత్త, విశ్వసనీయమైన సెబీ (SEBI) చీఫ్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) ఏర్పాటు చేయడం సరైన మార్గం అని సూచించారు.

కేసు ఏంటంటే?

అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడమే గాక.. దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు ఆఫర్‌ చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో (Adani Green energy) అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇదే టైంలో సెబీ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్‌ ఇంకా స్పందించలేదు.

Advertisement

Next Story