- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రకు తెలంగాణ రేషన్ బియ్యం.. చోద్యం చూస్తున్న యంత్రాంగం
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఆయన చూడడానికి అమాయకంగా కనబడతాడు. మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలా ఉంటారు. కానీ చేసే పని మాత్రం బిగ్ బ్లాక్ మార్కెట్ దందా..! ఆయన పేరు తెలియని అధికారి లేరు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, ఎక్సైజ్... ఇలా అన్ని శాఖలకు సుపరిచితుడు. బ్లాక్ మార్కెట్ దందా ఆయనకు నిత్యకృత్యం. తెలంగాణకు గోదావరి నది అవతలి ఒడ్డున మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా గ్రామం అడ్డాగా భారీ బ్లాక్ మార్కెట్ దందా సాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ఆసిఫాబాద్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పెద్దపల్లి తదితర జిల్లాల నుంచి రేషన్ బియ్యం భారీ ఎత్తున ఆ వ్యాపారి అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో బ్లాక్ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం తెలిసిన నియంత్రించే అధికార యంత్రాంగం ఆ వ్యాపారికి దాసోహం అవుతున్న ఆరోపణలు కూడా కోకొల్లలు.
నేరుగా అక్రమ రవాణా..
గోదావరి అవతలి ఒడ్డున ఉన్న మహారాష్ట్రలోని సిరొంచా గ్రామం అడ్డాగా అక్రమ వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వలస వెళ్లి అక్కడ ఒక రైస్ మిల్లును లీజుకు తీసుకుని బ్లాక్ దందాకు తెర లేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం ప్రధాన బ్లాక్ మార్కెట్ దందా కాగా కలప, లిక్కర్ సైతం ఇరు రాష్ట్రాల నడుమ భారీగా అక్రమ రవాణా జరుగుతున్న ఆరోపణలు ప్రత్యక్షంగానే ఉన్నాయి. అయితే ఈ దందాను నిలువరించే ప్రభుత్వ శాఖల్లో కొందరు కిందిస్థాయి ఉద్యోగులు అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్న ఆ వ్యాపారికి అండగా నిలుస్తున్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రిపూట ఆ వ్యాపారికి చెందిన వాహనాలు నేరుగా కోటపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచే ప్రాంతాలకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్రకు వెళ్లిపోతున్నాయన్న ప్రచారం ఉంది. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల నుంచి చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలానికి చేరుతాయి అక్కడి నుంచి మహారాష్ట్ర వ్యాపారి తన వాహనాల్లో లోడ్ చేసి యధేచ్చగా తరలిస్తున్న ఆరోపణలు ఉన్నాయి.
గతంలో రామగుండం సీపీగా పనిచేసిన ఓ ఐపీఎస్ అధికారి అత్యంత కఠినంగా వ్యవహరించి పీడీఎస్ రేషన్ అక్రమ రవాణాను కఠినంగా అణచివేశారు. అప్పట్లో ఆ వ్యాపారిపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ కూడా వినిపించింది. అయితే ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన సీపీ కూడా పోలీసు అధికారులపై గట్టి నిఘా పెట్టిన కారణంగా కొంత అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడినట్లు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో నిరోధించే విషయంలో మామూళ్లకు అలవాటు పడిన రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ శాఖలకు చెందిన అధికారులపై ఆ వ్యాపారి ఒత్తిడి పెంచుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నుంచి ఈ అక్రమ రవాణా ద్వారా పీడీఎస్ బియ్యం తరలిపోతున్న ఆరోపణలు ఉన్నాయి. నేరుగా రేషన్ షాప్ ల యజమానులతోనే ఆ వ్యాపారికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం గట్టి చర్యలకు దిగితే గాని ఆ మహారాష్ట్ర వ్యాపారి ఆగడాలు ఆగే సూచనలు కనిపించడం లేదు.