ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి

by Sridhar Babu |
ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి
X

దిశ, కాగజ్ నగర్ : ఖరీఫ్ వరిధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం వంజరి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు, ఐకేపీ, బ్యాంకు అధికారులతో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ కు సంబంధించి రానున్న వరి ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నందున, సన్న, దొడ్డు రకం ధాన్యాలకు వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వరి పంట పూర్తిగా ఎండిన తర్వాత కోతలు మొదలు పెట్టేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని, తద్వారా తేమ శాతంపై ఆందోళన ఉండదన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రదేశాలను ముందుగానే గుర్తించి పూర్తి ఏర్పాట్లతో సిద్ధం చేయాలని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని కోరారు. ధాన్యం తూకం ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాలో ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకు కేటాయించిన ప్రకారంగా తరలించాలని, రైస్ మిల్లులలో ధాన్యాన్ని వేగంగా అన్ లోడ్ చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డీఎస్పీ రామానుజం, జిల్లా సహకార శాఖ అధికారి రబ్బాని, వ్యవసాయ, విస్తరణ శాఖల అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed