పల్లె పోరుకు సిద్ధమేనా..?

by Sumithra |
పల్లె పోరుకు సిద్ధమేనా..?
X

దిశ, వేమనపల్లి : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పై మరోమారు దృష్టి సారిస్తుంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికలకు కావలసిన అన్ని రకాల చర్యల్లో దృష్టి పెడుతుంది. దీంతో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఈసారి ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన పై సర్వే చేస్తుండటంతో త్వరలోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుందని ఆశావాహులు ఇప్పటి నుండే సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచితే బీసీలకు మరింత లాభం చేకూరనుంది. సర్వే పూర్తయి కంప్యూటర్ లో నమోదు చేసి కులాల వారిగా గణన చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుండే గ్రామాల్లో రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులంతా ఇప్పటి నుండే గ్రామస్థాయిలో ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఆమలులో ఉండడంతో రిజర్వేషన్ పురుషుడికి వచ్చిన, మహిళలకు వచ్చిన, ఏ రిజర్వేషన్ వచ్చిన ఎవరిని పోటీలో ఉంచాలనే దాని పై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను గ్రామస్థాయిలో మీ ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువమంది పోటీ చేయాలని ఆశావహులంతా అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ పోటికై ఎదురు చూస్తున్నారు. "ఒకే ఓరలో రెండు కత్తులు ఉండవు అన్నట్లు"గానే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా పార్టీలో పలు పార్టీలకు చెందిన నేతలను చేర్చుకొని ఇప్పుడు ఎవరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుచరుడిగా మద్దతు ఇవ్వాలనే దాని పై నాయకులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముగ్గురు పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో మరింత ఆశావహుల సంఖ్య పెరగనుంది.

ఈసారి స్థానిక ఎన్నికల్లో నేను లేదా నా సతీమణిని పోటీ చేయించి గెలుపొందాలని రిజర్వేషన్ ఆడ, మగ వచ్చిన పోటీ చేయాలనే ఉత్సాహంతో ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రచారాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూర్తయి 10 నెలలు గడుస్తున్న గ్రామాల్లో పాలన వ్యవస్థ లేదు. పల్లెల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరు లేకపోవడంతో మండల, గ్రామ స్థాయి పరిపాలన వ్యవస్థ నిర్లక్ష్యంగా మారింది. స్థానిక సంస్థలలో ఉండే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కో ఆప్టెడ్ సభ్యుల వంటి ప్రజాప్రతినిధుల పదవి కాలం ముగిసిపోవడంతో మండల గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకునే నాథులే కరువయ్యారు. మండల స్థాయిలో 3 నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమావేశాలు నిర్వహణ సైతం మరుగున పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్వేను సకాలంలో పూర్తిచేసి కులగణన లెక్కల ప్రకారమే రిజర్వేషన్లను ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed