సరిపడ యూరియా వచ్చినా సరిపోవడం లేదు ఎందుకు..?

by Sumithra |
సరిపడ యూరియా వచ్చినా సరిపోవడం లేదు ఎందుకు..?
X

దిశ, లోకేశ్వరం : ఈ యాసంగికి సరిపడా యూరియా దాదాపుగా అధికారికంగా ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసినా ఇంకా మండలంలోని ఎరువుల దుకాణాలు, సొసైటీ ల ముందు, యూరియా కోసం రైతులు క్యూ లో ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం సరఫరా చేసిన యూరియా ఎటు వెళ్తోంది..? రైతులు మోతాదుకు మించి వినియోగిస్తున్నారా..? లేక ఇతర ప్రాంతాలకు తరలివెల్తోందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మండలంలో 20వేల ఎకరాల్లో సాగుతున్న పంటలు..

ఈ యాసంగిలో లోకేశ్వరం మండలంలో రైతులు పదివేల ఎకరాల్లో వరి, 8000 ఎకరాల్లో మొక్కజొన్న, రెండు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. కాగా ఈ పంటల సాగుకు దాదాపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. మార్చి మూడవ తేదీ వరకు మండలంలోని ఎరువుల దుకానాల డీలర్లు, పీఏసీఎస్ కౌంటర్ కు 2100 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. దీనికితోడు పలువురు అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్న రైతులు క్యూ లైన్ ల బాధ భరించలేక దాదాపు 2 మెట్రిక్ టన్నుల యూరియాను ధర్మాబాద్, నందిపేట్ ప్రాంతాల నుండి కొనుగోలు చేశారు. అలాగే పలువులు డీలర్లు సైతం యూరియా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర నుండి దిగుమతి చేసుకొని ఇక్కడి రైతులకు విక్రయించినట్లు సమాచారం. దీనితో యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుందో అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు మోతాదుకు మించి వినియోగిస్తున్నారా...?

ఈ యాసంగిసీజన్ లో పంటల ఎదుగుదల సక్రమంగా లేకపోవడంతో రైతులు మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరి పంటకు గతంలో ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే వినియోగించే వారని ప్రస్తుతం వరి పైరు సక్రమంగా ఎదగక పోవడంతో ఎకరానికి మూడు నుండి నాలుగు బస్తాలు వాడుతున్నట్లు సమాచారం. యూరియా అధిక వినియోగం వల్ల రైతులకు ఆర్థిక భారంతో పాటు నేల సారవంతం కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారి గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇకనైనా రైతులకు యూరియా వినియోగం పై అవగాహన కల్పించి, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా చూడాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story