ప్రతిగ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..

by Sumithra |
ప్రతిగ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి..
X

దిశ, ఆదిలాబాద్ : వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్ ను సోమవారం జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు. మొదటగా ఆదిలాబాద్ గ్రామీణ సీఐ బి.రఘుపతి, ఎస్సై జి.నాగనాథ్ పుష్పగుచ్చం అందజేసి జిల్లా ఎస్పీకి సాదరంగా ఆహ్వానించారు. తదుపరి సాయుధ బలగాలచే ఏర్పాటు చేయబడిన గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. తదుపరి సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బంది విధులను ఒక క్రమబద్ధీకరణతో నిర్ణయించి, సరైన పద్ధతిలో విధులను నిర్వర్తించేలా పోలీస్ స్టేషన్ అధికారికి సూచించారు. సిబ్బంది నిర్వర్తించే విధులను ప్రత్యేకంగా ఒక్కొక్కరితో మాట్లాడి తెలుసుకొని తగుసూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని, సిబ్బంది స్టేషన్ నిర్వహించే పద్ధతిని, పరిసరాలను, లాకప్, స్టేషన్ రూమ్, రైటర్ గది వాటిని పరిశీలించి సూచనలు చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను సిబ్బంది వేచి ఉండే ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసుల ప్రస్తుత స్థితిగతులను కోర్టులను పెండింగ్లో ఉన్న కేసువివరాలను తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ రికార్డులు ఫైళ్లను ఒక క్రమబద్ధీకరణలో ఉంచుకొని 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయాలని సిబ్బంది అందరికీ అన్ని వర్టికల్స్ పై అవగాహనను కల్పించే విధంగా సిబ్బందిని తయారు చేయాలని సూచించారు. సంఘటన జరిగిన అనంతరం వేగంగా స్పందించే రియాక్టివ్ పోలీసింగ్ కంటే సంఘటన జరగకముందే ముందస్తుగా పసిగట్టి నివారించే ప్రో యాక్టివ్ పోలీసింగ్ కు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శిస్తూ గ్రామంలో ఉన్న పెద్దలతో సమన్వయంగా ఉంటూ ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలియజేశారు.

ప్రస్తుతం సైబర్ క్రైమ్ జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో సందర్శించే సమయంలో ఉన్న యువతకు పెద్దలకు సైబర్ క్రైమ్ నేరస్తులు ఉపయోగించే నవీన పద్ధతులను వివరించి మోసపోకుండా తగు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలోని ప్రజలకు డయల్ 100 పై అవగాహనను కల్పించి ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా ప్రజలు డయల్ 100 ను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల యువత, ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చే మార్గాలలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ ను చేయకుండా చూడాలని వివరించారు. సిబ్బంది మరింత కష్టపడి పనితీరును మెరుగు పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ బి.రఘుపతి ఎస్సై, జి.నాగనాథ్, సర్కిల్ ఎస్సైలు విష్ణు వర్ధన్, జి.అప్పారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed