నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

by Sumithra |
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
X

దిశ, తాండూర్ : మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద శనివారం 5 క్వింటాళ్ల నిషేదిత (బీటీ-3) నకిలీ పత్తి విత్తనాలను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ అశోక్ కుమార్ తెల్పిన వివరాల ప్రకారం నకిలీ పత్తివిత్తనాలు రవాణా చేస్తున్నారనే నమ్మ దగిన సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి బోర్డు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మంచిర్యాల వైపు వస్తున్న కారు, బొలెరో ట్రాలి వాహనం ఆపి తనిఖీ చేయగా బొలెరో ట్రాలీ వాహనంలో పైన వడ్లు బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమార రూ.10 లక్షలు విలువ చేసే 5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత (బిటి-3) నకిలీ విత్తనాలు గుర్తించామన్నారు.

విత్తనాలు తరలిస్తున్న శ్రీరాముల నవీన్ (రేచిని), ఒడ్నాల రాకేష్ (కొమురవెల్లి), మోర్ల వెంకట స్వామి (భీమిని)లను అరెస్టు చేసి విచారించగా రేచినికి చెందిన కొడిప్యాక రంజిత్, గాండ్ల మహేష్ అనే వ్యక్తులు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలు, బోలోరే ట్రాలీ, కారు స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం తాండూర్ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. రంజిత్, మహేష్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story