అలాచేస్తే ఐసీడీఎస్ రోడ్డున పడుతుంది : సీఐటీయూ రాష్ట్ర నాయకులు నాగరాజు గోపాల్

by Sumithra |   ( Updated:2022-09-28 15:30:25.0  )
అలాచేస్తే ఐసీడీఎస్ రోడ్డున పడుతుంది : సీఐటీయూ రాష్ట్ర నాయకులు నాగరాజు గోపాల్
X

దిశ, బెల్లంపల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర నేత నాగరాజు గోపాల్ అన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థను కాపాడుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని పిలుపునిచ్చారు. తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రెండో జిల్లా మహాసభలను స్థానిక బెల్లంపల్లి పట్టణంలోని తాపీ మేస్త్రి భవనంలో బుధవారం నిర్వహించారు. అంగన్వాడి యూనియన్ సీనియర్ నాయకురాలు వినోద జెండా ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి ఎనగందుల భానుమతి అధ్యక్షతన మహాసభ ప్రారంభమైంది.

ఈ మాసభలకు ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు నాగరాజు గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఐసీడీఎస్ కు తగిన బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. నిరంతరం బడ్జెట్టును తగ్గిస్తూ, ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసే దిశగా కుట్ర పన్నుతుందని విమర్శించారు. జాతీయ నూతన విద్యా విధానం పేరుతో దేశంలో అసలు అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేయాలనే ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉందన్నారు. ఇది దేశంలో, రాష్ట్రంలో అమలైతే ఐసీడీఎస్ మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ 2018లో పెంచిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడం చాలా దారుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్లైన్, ఆన్లైన్ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఒకవైపు అధికారులు మరోవైపు కౌన్సిలర్ల వేధింపులు నిత్యం పెరుగుతున్నాయన్నారు. నెలలు గడుస్తున్నా పాఠశాలల అద్దెలు మాత్రం ఇంకా చెల్లించలేదు. గ్యాస్ బిల్లులు, టీఏ, డీఎలు అన్ని పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ సెంటర్లుగా మార్చే దాంట్లో ఉన్న నిబంధనలు మార్చాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ.భానుమతి, విరోనిక, రాజమణి, సువర్ణ, పద్మావతి, శంకరమ్మ, రాజేశ్వరి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకే రవి, అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed