ముంపు తిప్ప‌లకు ముగింపు.. బ్యాక్ వాటర్ సమస్యలకు చెక్

by Nagam Mallesh |
ముంపు తిప్ప‌లకు ముగింపు.. బ్యాక్ వాటర్ సమస్యలకు చెక్
X

దిశ‌, మంచిర్యాలః మంచిర్యాల జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా ఉన్న ప్రజల సమస్యకు పరిష్కారం దొరకబోతోంది. వ‌ర‌ద ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింది. గోదావరి వరద ముంపున‌కు గురయ్యే ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించాలనే ప్రతిపాదనకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. కరకట్టలు, నిర్మాణానికి అవసరమైన బ‌డ్జెట్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఆ మేర‌కు రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ఇన్నాళ్లుగా ముంపు బాధలు పడుతున్న జిల్లా కేంద్రంలోని పలుకాలనీల ప్రజలకు ఆ బాధలు తప్పినట్లయింది. వర్షాకాలంలో రాళ్లవాగు ఉప్పొంగి ఏడెనిమిది కాలనీ ఈ నీట మునుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నీటిపారుదల శాఖ అధికారులు ఆ వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి అంచనా వ్యయంతో కూడిన ప్రతి పాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేశారు. రక్షణ గోడల నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు, భూ సేకరణ అవసరమనడంతో తలకు మించిన భారంగా భావించిన గత ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టింది.

ఏటా ముంపు ముప్పే

కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి ప్రతి ఏటా ముప్పు తప్పడం లేదు. వరుసగా రెండేళ్లుగా జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా. కేంద్రంలో జనజీవనం అతలాకుతలం అయింది. అంతకు ముందు జూలై 19న‌ కుండపోతగా వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వాగులు పొంగి పొర్లి గోదావరి ఉప్పొంగింది. ఈ కారణంగా వాగుల్లో నీరు ఎదురెక్కి నివాస గృహాల్లోకి చేరింది అర్ధరాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో ప్రజలు తేరుకొనేలోపే కాలనీలు నీట మునిగాయి. గత సంవత్సరం జూలైలో కురిసిన వర్షాలకు మళ్లీ ఆయా కాలనీలు నీట ముదిగాయి. దీంతో ముందస్తుగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గత అనుభవాల ను దృష్టిలో ఉంచుకున్న అధికార యంత్రాంగం పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2022, 2023 సంవత్సరాల్లో గోదావరికి భారీ వరదలు రావడంతో ఆ రెండేండ్లు పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీ స్థాయిలో వరద రావడం, సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ రాళ్లవాగులోకి ఎగదన్నడం వల్ల కాలనీలు జలమయం అయ్యాయి. ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎన్ఐఐసీ కాలనీ, పద్మశాలీకాలనీ, ఆదిత్య ఎన్ క్లేవ్, సంజీవయ్య కాలనీ, రెడ్డి కాలనీ, పాత మంచిర్యాల తదితర ప్రాంతాలు రెండు రోజుల పాటు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

రూ.236 కోట్లతో ప్ర‌తిపాద‌న‌లు..

గతేడాది బీఆర్ఎస్ సర్కార్ రాళ్లవాగుకు కరకట్టల కోసం ప్ర‌తిపాద‌న‌లు తయారు చేయించింది. 2022, 2023 సంవత్సరాల్లో వచ్చిన వరదను పరిగణనలోకి తీసుకున్న సాగునీటి శాఖ అధికారులు రూ.236 కోట్లతో అంచనాలు రూపొందించారు. కార్మెల్ స్కూల్ దగ్గరి నుంచి గోదావరి వరకు కరకట్టల నిర్మాణానికి ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగుకు కరకట్టలు నిర్మాణం చేపట్టడం ద్వారా వరదను నివారించడానికి పట్టణంలోని కార్మెల్ స్కూల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర నుంచి 5.67 కిలోమీటర్ల పొడవున 140 మీటర్ల ఎత్తుతో ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని, అలాగే గోదావరి నది ఎడమవైపు గోదావ‌రి క‌లిసే చోట రెండు కిలోమీట‌ర్ల పొడ‌వునా కూడా ఈ క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు.

కరకట్టల నిర్మాణాలకు ఆమోదం

గ‌త ప్ర‌భుత్వం ఈ క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం గురించి క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు నిరాశ‌, నిస్పృహ‌లు వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది కూడా ముంపు త‌ప్ప‌ద‌ని భ‌యంతో ఉండిపోయారు. అదృష్ట‌వ‌శాత్తు ఈ ఏడాది భారీ వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో గోదావ‌రికి వ‌ర‌ద ముంపు త‌ప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరకట్టల అంశాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగ‌ర్ రావు ప్రస్తావించారు. ఈ మేరకు ప్రభుత్వం 2024-25 సంవత్సరం బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించింది. కరకట్టల కోసం రాళ్లవాగుకు రెండు వైపులా భూములు సేకరించాల్సి ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుతో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. వీలైనంత త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు.

Advertisement

Next Story