కష్టపడితే మళ్లీ అధికారం మనదే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Sumithra |
కష్టపడితే మళ్లీ అధికారం మనదే : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : పార్టీ నేతలు కార్యకర్తలు కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని తెలంగాణలో మూడోసారి భారత రాష్ట్రసమితి అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం నిర్మల్ జిల్లాలోని నరసాపూర్ జి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రెండు పర్యాయాలు అధికారం చేపట్టేదాకా కార్యకర్తలే పార్టీకి పునాది అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ భారతదేశంలోని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా రైతుబంధు రైతుబీమా కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆసరా పింఛన్లు అత్యంత ఉత్తమ పథకాలు అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను తట్టుకోలేక ఎమ్మెల్సీ కవితను కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని కార్యకర్తలు సమస్యగా తిప్పికొట్టాలన్నారు. పార్టీ జిల్లా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ జడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed