బీజేపీ అభ్య‌ర్థి నగేష్ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించాలి.. కాంగ్రెస్ నాయకుల నిరసన

by Disha Web Desk 23 |
బీజేపీ అభ్య‌ర్థి నగేష్ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించాలి.. కాంగ్రెస్ నాయకుల నిరసన
X

దిశ,ఆదిలాబాద్ : ఎన్నిక‌ల క‌మిష‌న్ నియామ‌వ‌ళికి అనుగుణంగా బీజేపీ అభ్య‌ర్థి గోడం న‌గేష్ నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేయ‌లేద‌ని, వెంట‌నే ఆయ‌న‌ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించాల‌ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లోబడి ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల నియమావళికి అనుగుణంగా తన దరఖాస్తును బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ పూర్తి చేయకపోయినా ఎందుకు రిజెక్ట్ చేయలేదని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు.. ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన అనంత‌రం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గూడెం న‌గేష్ త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాల‌ను ఎన్నికల నియమావళికి అనుగుణంగా పొందుప‌ర్చ‌లేద‌ని ఆరోపించారు.

ఆ ఖాళీని పూరించ‌కుండా వ‌దిలేశార‌ని అన్నారు. ఎన్నిక‌ల అధికారులు స్పందించి వెంట‌నే ఆయ‌న నామ‌ప‌త్రాల‌ను తిర‌స్క‌రించాలంటూ డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఏ రాజ‌కీయ‌ పార్టీల‌కు అనుకూలంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే త‌మ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామ‌ని, అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంలో న్యాయ పోరాటం చేయ‌డానికి సైతం సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై జిల్లా ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి, కలెక్ట‌ర్ త‌క్ష‌ణ‌మే స్పందించాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌లిసి ఆందోళ‌న చేప‌ట్టారు. బీజేపీ అభ్య‌ర్థి నామ‌ప‌త్రం దాఖ‌లుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం అంటూ ఆరోపించారు. బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి కనుగుణంగా వ్యవహరించాల్సిన అధికారులు కేవలం కేంద్ర ప్రభుత్వ అభ్యర్థికి అనుకూలంగా విధులు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై న్యాయం కోసం ప్ర‌జా కోర్టులో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బోథ్ అసెంబ్లీ ఇన్‌చార్జి ఆడే గ‌జేంద‌ర్‌, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, త‌ల‌మ‌డుగు, జైన‌థ్‌ జ‌డ్పీటీసీలు గోక వెంకట్‌రెడ్డి, అరుంధ‌తి వెంక‌ట్ రెడ్డి, మున్సిప‌ల్ వైస్ చైర్మెన్ జ‌హీర్ రంజాని, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed