సీఎస్కే ఫ్యాన్ మొబైల్‌ను పగలగొట్టిన చెన్నయ్ ఆటగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Harish |
సీఎస్కే ఫ్యాన్ మొబైల్‌ను పగలగొట్టిన చెన్నయ్ ఆటగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ క్రికెటర్ డారిల్ మిచెల్ ఓ అభిమాని మొబైల్‌ను పగలగొట్టాడు. అయితే, అది అతను కావాలని చేయలేదు. ప్రాక్టీస్ చేస్తుండగా బంతి వెళ్లి తగలడంతో మొబైల్ కిందపడి పగిలింది. ఈ ఘటన ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్, చెన్నయ్ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అసలేం జరిగిందంటే.. చెన్నయ్, పంజాబ్ మ్యాచ్‌ను వీక్షించేందుకు కొందరు అభిమానులు ముందే వచ్చారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మిచెల్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మిచెల్ బాదిన బంతి స్టాండ్స్‌లో కూర్చున్న ఓ అభిమాని మొబైల్‌కి తాకింది. దాంతో ఫోన్ కిందపడగా వెనకభాగం డ్యామేజ్ అయ్యింది. అది గ్రహించిన మిచెల్ సదరు అభిమానికి సారీ చెప్పాడు. అంతేకాకుండా, తన గ్లోవ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. మిచెల్ నుంచి బహుమతి అందుకోవడంతో సదరు అభిమానులు ఆనందానికి అవధులు లేవు. గ్లోవ్స్‌తో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సదరు అభిమాని ఐఫోన్ వాడుతున్నాడు. ఖరీదైన ఫోన్ పగలగొట్టుకుని గ్లోవ్స్‌తో ఏం చేస్తాడని కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఆ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో పంజాబ్‌పై చెన్నయ్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మిచెల్ 19 బంతుల్లో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన మిచెల్ 229 పరుగులు చేశాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఆరు విజయాలు సాధించిన ఆ జట్టు 12 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నది. ఈ నెల 10న గుజరాత్‌ను ఎదుర్కోనుంది.

Advertisement

Next Story

Most Viewed