మరో రెండు, మూడు రోజులు వర్ష సూచన.. రైతుల్లో గుబులు

by Mahesh |   ( Updated:2023-03-21 02:50:26.0  )
మరో రెండు, మూడు రోజులు వర్ష సూచన.. రైతుల్లో గుబులు
X

దిశ, మంచిర్యాల: మరో రెండు మూడు రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతుల్లో గుబులు పుట్టిస్తుంది. శనివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని రైతులకు తీరని నష్టం కలిగించగా.. మళ్లీ వర్ష సూచన ఉందని తెలియడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అకాల వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 307 ఎకరాల్లో 175 మంది రైతులకు చెందిన రూ.16.55 లక్షల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మిర్చి మామిడి తోటల నష్టాన్ని అంచనా వేసే సర్వే పనుల్లో ఉద్యానవన శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, అధికారులు నిర్వహించిన ప్రాథమిక నష్టం అంచనా కన్నా వాస్తవ నష్టం నాలుగింతలు ఎక్కువగానే ఉంటుందని రైతులంటున్నారు.

చీడపీడల ప్రభావం...

బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లాలోని జన్నారం దండేపల్లి మండలాల్లోని వరి పైరు పైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ మండలంలోని తాళ్ల పేట, రెబ్బనపల్లి, నాగసముద్రం, గూడెం మోకులపేట, నర్సాపూర్, జన్నారం మండలంలోని తిమ్మాపూర్, ద్వారక, తపాల్ పూర్, రోడ్డు కూడా తదితర గ్రామాల్లో ఈనె దశ, పొట్ట దశకు వచ్చిన వరి పంటపై ప్రభావం చూపింది.

అక్కడక్కడ ముందుగా నాటు వేసిన ఇప్పుడు గొలక దశకు వచ్చిన పైరు పడిపోవడం, గింజలు నేలరాలాయి అక్కడక్కడ ఈదురుగాళ్లకు మొక్కజొన్న కర్రలు విరిగిపోగా, దిగుబడి తక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్షానికి తోడు చల్లటి వాతావరణం అలుముకోవడం వరి, మామిడి, కూరగాయల పంటలపై చీడపీడల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మామిడి తోటలకు నష్టం..

అకాల వర్షంతో జిల్లాలోని నెన్నెల జైపూర్, భీమారం మందమర్రి మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నెన్నెల మండలంలోని చిత్తాపూర్, జోగాపూర్, ఆవడం, గొల్లపల్లి, మందమర్రి మండలంలోని మామిడి గట్టు పొన్నారం, ఆదిల్ పేట, వెంకటాపూర్ గ్రామంలో మామిడి తోటల చిన్న చిన్న పిందెలు, కాయలు నేలరాలాయి నేల రాలిన చిన్న చిన్న కాయలను అమ్ముకుందామన్న తక్కువ ధరకు అమ్ముదామనుకున్నా.. కొనేవారు కానరాక గత్యంతరం లేక పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మామిడి తోటల రైతులు వాపోతున్నారు. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మిర్చి పంట ఉత్పత్తులను రెండో దఫా తీయించి ఆరబెట్టగా వర్షాలకు దెబ్బతింది.

Advertisement

Next Story

Most Viewed