- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Adilabad: కేటాయింపులు అంతంతే..ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు
దిశ,ఆదిలాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నిధులు వస్తాయని భావించినా పెద్దగా ఊరట లభించలేదు. ఈ జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 20 శాతం అదనంగా కేటాయించాలని నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ అలాంటిదేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాకు..
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్న ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు మళ్లీ నిరాశ ఎదురైంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఈసారైనా భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించిన రైతులకు ఆశాభంగం కలిగింది. అత్తెసరు నిధుల కేటాయింపు వల్ల ఎలాంటి ఉపయోగం సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. గిరిజన జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేయ కపోవడం శోచనీయమని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో భారీగానే కేటాయింపులు జరుగుతాయని భావించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కన్నీళ్లే మిగిలించారు.
తెలంగాణలో వెనుకబడి ఉన్న ఏజెన్సీ జిల్లా అయిన ఆసిపాబాద్ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అధికారుల ప్రతిపాదనలకూ మోక్షం లభించ లేదు. ముఖ్యంగా జిల్లాలో పలు రోడ్లు గుంతలమయమవ్వగా, జిల్లాలో చాలా గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యం లేదు. ఏజెన్సీ గ్రామాలకు నేటికీ లింకు రోడ్లు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. తాత్కాలిక మరమ్మతులతో అధికారులు మమ అనిపిస్తున్నారు.
జిల్లాలో కుమురంభీం (ఆడ), వట్టివాగు, జగన్నాథ్ పూర్, పీపీ రావు సాగర్, ఎన్టీఆర్ సాగర్ వంటి మధ్య తరహా ప్రాజెక్టులకు నిధుల విషయంలో సందిగ్ధతనే నెలకొంది. దీంతో కాలువల నిర్వహణ, మరమ్మతులు, భూసేకరణ వంటి పనులు స్తంభించనున్నాయి. ముఖ్యంగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కుమురంభీం, జగన్నాథపూర్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి కావడా నికి నిధులు కేటాయింపులు సక్రమంగా చేయలేదు.
మంచిర్యాల జిల్లా...
మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎన్నో ఆశలు గల్లంతయ్యాయి. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రం గత ఏడాది వరదల్లో మునిగింది. అంతేకాకుండా, కాశేళ్వరం ప్రాజెక్టు వల్ల తీర ప్రాంతంలోని పంటలు వరద వచ్చి ముంపునకు గురవుతున్నాయి. మంచిర్యాల, చెన్నూరు, నస్పూర్ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు ఈ వరదతో నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. తీర ప్రాంత వరకు ఇళ్ల నిర్మాణాలు ఉండటంతో కరకట్ట కడితే వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశలు ఉండేవి. కానీ, ఆ కేటాంపులు చేయలేదు. ఇక జిల్లాలో ఎక్కడా ప్రధాన సాగునీటి వనరులు లేవు. మధ్యతరహా, చిన్న నీటి పారుదల ప్రాజెక్టులతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. గోదావరిపై చెన్నూర్ ఎత్తిపోతలకే నిధులు కేటాయిస్తారని భావించినా అవి ఇవ్వలేదు. ర్యాలీవాగు, భీమారంలో గొల్లవాగు ప్రాజెక్టులు ఆధునికీకరిం చాల్సి ఉంది. వాటికి కూడా నిధులు కేటాయించలేదు.
సింగరేణి పరిధిలోనూ కార్మికుల సమస్యలపై దృష్టి సారించలేదు. కొత్త గనుల ఏర్పాటు లేకపోగా, ఓపెన్ కాస్టుల ప్రభావంతో భూగర్భ గనులు తగ్గిపోయి ఉపాధిపై ప్రభావం చూపుతోంది. అటు వైపుగా దృష్టి సారిస్తుందనుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రికి సమస్యలు ఉన్నాయి. దానికి నిధులు కేటాయించాలి, పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. ఇలా ఎన్నో రకాలుగా సమస్యలు ఉన్నా దానిపై దృష్టి సారించలేదు. జిల్లాలో పర్యాటకం అవకాశం ఉన్నా సౌకర్యా లు లేక సరైన దిశలో ఉపయోగించుకోలేని పరిస్థితులు. వీటన్నింపైనా దృష్టి సారిస్తారని కోరుకున్నారు. కానీ నిధులు విడుదల చేయలేదు.
నిర్మల్ జిల్లాకు..
నిర్మల్ జిల్లాలో పలు ప్రాజెక్టులకు నిధులు లేక నీరసించిపోతున్నాయి. సదర్మాట్ బ్రిడ్జీకి సంబంధించి విద్యుదీకరణ, ఇతర పనులకు అవసరమయ్యే రూ. 78 కోట్లు విడుదల చేస్తరని భావించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ఆ బ్యారేజీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. పలు ప్రాజెక్టుల పరిస్థితి అలాగే ఉంది. ఇక కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో గత ఏడాది వచ్చిన వరదల కారణంగా అనేక చోట్ల వంతెనలు రోడ్లు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి నిర్మించలేదు. జిల్లాలో దాదాపు రూ. 100 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో రోడ్ల విస్తరణ, మరమ్మతులకు ఇవ్వాలని అంచనాలు రూపొందించారు. ఇప్పటికీ నయా పైసా రాలేదు. బడ్జెట్‌లో సైతం దాని ఊసు లేదు. చాలా చోట్ల వైద్యాధికారులు సైతం లేరు. వీటన్నింటి విషయంలో నిధులు విదిలించలేదు.
ఆదిలాబాద్ జిల్లాకు...
ఈ జిల్లాలో కూడా గిరి గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని భావించినా అది కలగానే మిగిలింది. జిల్లాలో ఎయిర్‌పోర్టు లేకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇక్కడ భూములకు ఎన్‌వోసీ జారీ చేస్తారని భావించారు. అది కూడా జరగలేదు. ఇక జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధిచి సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలేమీ తీసుకోలేదు. దీంతో, ఆదిలాబాద్ జిల్లాకు సైతం మొండి చేయేనని పలువురు చెబుతున్నారు.