పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు : Minister Harish Rao

by Nagaya |   ( Updated:2023-01-09 15:07:02.0  )
పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు : Minister Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన పేషెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్​రావు హెచ్చరించారు. సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్​స్టాఫ్‌‌తోనే సమస్య ఎక్కువగా ఉన్నదన్నారు. సోమవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల నెలవారీ సమీక్షను ఆయన హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేస్తున్న కృషి వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. గడిచిన ఏడాదిగా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రసవాలు చేసుకునేందుకు 66 శాతం మంది ప్రభుత్వాసుపత్రులకే వస్తుండటమే దీనికి నిదర్శనం అన్నారు. ప్రజల్లో పెరిగిన నమ్మకాన్ని కాపాడుకోవాలని, నిలబెట్టుకునేలా ముందుకు సాగాలన్నారు. ప్రజల మన్ననలు పొందేలా మరింత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం జిల్లా ఆసుపత్రులు, ఎమ్​సీ హెచ్ లు, సీహెసీలు, డీ పీసీ, పాలియేటివ్ కేర్ లు ప్రారంభించామని, అక్కడ పూర్తి స్థాయిలో సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్స్ పైన ఉందన్నారు.

పేదల కోసం పనిచేయాలి

ప్రభుత్వాసుపత్రులలో ఇటీవల పోస్టింగ్ పొందిన సీనియర్ రెసిడెంట్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఆయా విభాగాల వారీగా పూర్తి స్థాయిలో సేవలందించేలా చూసుకోవాలన్నారు.కొత్త ఉద్యోగంలో చేరిన వైద్యులు నూతన ఉత్సాహంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించుకున్న 56 టిఫా స్కానింగ్ సేవలు గర్భీణులకు అందేలా చూడాలన్నారు. సీ– సెక్షన్ల శాతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. అనవసర సీ– సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సిలింగ్ ద్వారా వివరించాలన్నారు. పేషెంట్ కండీషన్​బట్టి సీ–సెక్షన్ నిర్వహించాలా? సాధారణ డెలివరీ చేయాలా? అనేది డాక్టర్లు వివరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

అన్ని ఆసుపత్రుల్లో చలి తీవ్రతతో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త డైట్ ప్రకారం పేషెంట్లకు భోజనం అందేలా చూడాలన్నారు. సూపరింటెండెండ్లు భోజనం క్వాలిటీ చెక్ చేస్తూ ఉండాలన్నారు. మందుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాస రావు, డీఎంఇ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాలు ఏరియా, ఎంసీహెచ్, సీహెచ్సీ ఆసుపత్రులు సూపరింటెండెండ్లు, జిల్లా వైద్యాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed