ENC మురళీధర్ రాజీనామాకు ఆమోదం

by GSrikanth |
ENC మురళీధర్ రాజీనామాకు ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రాజీనామాకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 8న రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించడంతో ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం భావిస్తుందని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ఈ-ఇన్-సీ (జనరల్) బాధ్యతల నుంచి మురళీధర్ తప్పుకున్నందున ఆ బాధ్యతలను నిర్వర్తించేలా తగిన అధికారిని ఎంపిక చేయాలని ఈ-ఇన్-సీ (అడ్మిన్)ను ఆదేశించారు. మురళీధర్ చివరి వర్కింగ్ డే ఫిబ్రవరి 8, 2024 అని నొక్కిచెప్పారు. ఆయన రాజీనామా చేసినరోజే కాళేశ్వరం ఇన్‌చార్జి (రామగుండం) ఈ-ఇన్-సీ నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికే మురళీధర్ సర్వీసు నుంచి రిటైర్ అయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి నియమించి (సర్వీస్ ఎక్స్ టెన్షన్) ఇప్పటివరకూ ఇంజనీర్-ఇన్-చీఫ్ (జనరల్) బాధ్యతల్లో కొనసాగించారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డి బ్యారేజీ డ్యామేజీ, దీనికి బాధ్యులెవరనే నిర్ణయంలో వచ్చిన తేడాలు, కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంలో చేసిన కామెంట్లు.. ఇలాంటి అనేక అంశాలతో ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆయనను రాజీనామా చేయాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో ఫిబ్రవరి 8న రిజిగ్నేషన్ లెటర్‌ను ప్రభుత్వానికి (సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి) పంపారు. ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

Next Story