E-Racing Scam: పద్మవ్యూహంలో ఇరుక్కుంటున్న బీఆర్ఎస్.. పట్టు బిగిస్తున్న ఏసీబీ

by karthikeya |   ( Updated:2024-11-08 02:42:20.0  )
E-Racing Scam: పద్మవ్యూహంలో ఇరుక్కుంటున్న బీఆర్ఎస్..  పట్టు బిగిస్తున్న ఏసీబీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఫార్మూలా ఈ-రేసులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. రెండోసారి రేసు నిర్వహణకు విదేశీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని, హెచ్ఎండీఏ నుంచి అనుమతి లేకుండా రూ. 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఉచ్చు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు చుట్టుకోనుందని, అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతున్నది. దీంతో గులాబీ అధిష్టానం అప్రమత్తమైంది. అరెస్టు చేస్తే అనుసరించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫాం హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో రెండు, మూడు రోజుల క్రితం కేటీఆర్ భేటీ అయి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఫార్మూలా-ఈ కేసు అంటూ తెరమీదకు తెచ్చారని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఒక వేళ కేసు పెట్టి జైలుకు తరలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా కేడర్ ను సన్నద్ధం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

గ్రేటర్ ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు

గ్రేటర్ హైదరాబాద్ లో ఫార్మూలా-ఈ రేస్ నిర్వహించడంతోపాటు పార్టీ సైతం బలంగా ఉంది. దీంతో రెండు రోజుల క్రితం కేటీఆర్ గ్రేటర్ లోని పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు తెలిసింది. అరెస్టు చేస్తే పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలను చర్చించినట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోనూ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఫార్మూలా-ఈ రేస్ తో తెలంగాణకు వచ్చిన పేరు ప్రఖ్యాతులతోపాటు వచ్చిన పెట్టుబడులు వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని సైతం వివరించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కేడర్ ను యాక్టివ్ చేయడంతో పాటు రాబోయే గ్రేటర్ ఎన్నికలకు వారిని రెడీ చేయాలని భావిస్తున్నారు.

కక్షసాధింపు చర్యలంటూ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్

బీఆర్ఎస్ హయాంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసినందుకే కక్ష సాధింపుగా ఫార్ములా ఈ రేసింగ్ పేరుతో కేటీఆర్ ను అరెస్టు చేస్తున్నారని ప్రజల్లోకి వెళ్లేలా పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ పెంచేందుకు రేసు నిర్వహిస్తే అవకతవకలంటూ దుష్ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నాదు. ఇంకా ఈ కేసులో ఇప్పటివరకు కేటీఆర్ కు ఎలాంటి నోటీసు రాలేదు. కానీ అరెస్టు ప్రచారం జరుగుతుండటంతో దానిని తిప్పికొట్టేందుకు గులాబీ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నది.

కేడర్ కు ముందస్తు సంకేతాలు!

అరెస్టు చేస్తే కేడర్ ఏం చేయాలనేదానిపైనా కేటీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. దైర్యంగా ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తాలని, ఆరు గ్యారంటీలు, 420 హామీలపై పోరాటం చేయాలని సంకేతమిచ్చారు. కేసులకు భయపడేది లేదని, ఇంకా ఫిట్ గా ఉంటామని, యాత్ర చేపడతానని కూడా పేర్కొన్నారు. కేసు పెడితే పార్టీకి సైతం మరింతగా కలిసి వస్తుందని, ఇదే అంశంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు దోహదపడుతుందని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేడర్ కు సైతం పార్టీ కార్యాచరణ ఇస్తుందని, దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత ఎక్కువవుతున్నదని, ఇది కూడా కలిసి వస్తుందని అంటున్నారు.

Also Read :

KTR చుట్టూ ‘ఈ-రేసింగ్’ ఉచ్చు! భయంతో మలేషియాకు ఎస్కేప్?

Advertisement

Next Story