Aadi Srinivas: కేటీఆర్ నీ ఉడుత ఊపులకు ఎవరు భయపడరు.. ఆది శ్రీనివాస్ కౌంటర్

by Prasad Jukanti |
Aadi Srinivas: కేటీఆర్ నీ ఉడుత ఊపులకు ఎవరు భయపడరు.. ఆది శ్రీనివాస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ తమ కార్యకర్తల కోసం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) మండిపడ్డారు. కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కేటీఆర్ ఖబర్దార్ అని హెచ్చరించారు. మేము ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతుంటే మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మీ బూతు మాటలకు బూతు మాటలతోనే సమాధానం ఇస్తామని హెచ్చరించారు. తాను అంతా మంచివాడిని కాదని కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు. ఆయన మంచి వాడు కాదు ముంచేవాడని మేమేనాడో ప్రజలకు చెప్పామన్నారు. కేటీఆర్ రెడ్, పింక్, బ్లాక్ ఏ కలర్ బుక్ రాసుకున్నా మీ ఉడుతా ఊపులకు ఇక్కడ ఎవరూ భయపడేవారెవరూ లేరన్నారు. మీ కుటుంబంలోని నలుగురు తప్పా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. దీపావళి రోజున డ్రగ్స్ పార్టీ చేసుకున్న వ్యక్తి మాకు నీతులు చెప్తున్నారు. కేటీఆర్ సన్నిహితుడు, డ్రగ్స్ ప్లెడర్ దుబాయిలో అనుమానాస్పదంగా చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఎందుకు రావడం లేదు?:

పదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అనేది కేబినెట్ మినిస్టర్ స్థాయి. లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) అసెంబ్లీకి ఎందురు కావడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడటానికి మొహం లేక బహిరంగ సభల పేరుతో హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మీకు వీలుదొరుకుతుంది కానీ అసెంబ్లీకి రావడానికి వీలులేదా అని నిలదీశారు.

Next Story