సిగరెట్ తాగొద్దన్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు..12 ఏళ్ల తర్వాత నేరస్తుడై కనిపించాడు.. ఇంతకూ అతనెవరు?

by Maddikunta Saikiran |
సిగరెట్ తాగొద్దన్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు..12 ఏళ్ల తర్వాత నేరస్తుడై కనిపించాడు.. ఇంతకూ అతనెవరు?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు 12 ఏళ్ళ తరువాత నేరస్థుడై కనిపించాడు. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలికి చెందిన అలం చిమన్ రావు లచ్చయ్య ఆర్మీ ఉద్యోగికి అర్మాన్ అలం అనే కుమారుడు ఉన్నాడు. తన కుమారుడు 12 ఏళ్ల వయసు నుంచే సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన కొడుకును తండ్రి మందలించాడు.దీంతో అర్మాన్ తండ్రికి బయపడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అర్మాన్ అలం ఆచూకి కోసం తల్లి తండ్రులు పలు చోట్ల వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో అహేరి పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి పలు ప్రాంతాలలో వెతికినప్పటికి తన కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అర్మాన్ ఆలం జార్ఖండ్ కు వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ కు రైలులో చేరుకున్నాడు. సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ వద్ద ఉంటూ నేర వృత్తిని ఎంచుకొని నేరస్తుడిగా మారి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమంది నేర వృత్తి కలిగిన వ్యక్తులతో కలిసి పలు నేరాలకు పాల్పడ్డాడు. చివరికి 12 సంవత్సరాల తర్వాత అతని నేరాలకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారంట్ ధ్రువీకరణలో భాగంగా ఇతని ఆచూకీ లభ్యం కావడంతో అ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేసినట్లు హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కేసు వివరాలను డీసీపీ బుధవారం సికింద్రాబాద్ లోని తన కార్యాలయంలో వెల్లడించారు.అయితే యువకుడి తండ్రి చిమన్ రావు లచ్చయ్య రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా, తల్లి సుందేరా రీనా అలం పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత తన కుమారుడిని చూడడంతో కన్నతల్లి సుందేరా రీనా అలం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఆచూకి ఇలా లభ్యం..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్స్ సమీపంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి దొంగలుగా మారి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని రక్షించేందుకు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్ లో భాగంగా పోలీసులు పాత కేసులను పరిశీలిస్తున్న నేపథ్యంలో అర్మాన్ గురించి ఆరా తీయగా 12 సంవత్సరాల క్రితం రాంచీ నుండి పారిపోయి వచ్చి ఇక్కడ దొంగతనాలకు అలవాటు పడ్డట్లు పోలీసుల విచారణలో వెళ్లడైంది. అర్మాన్ ఆలంకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పోలీసులు రాంచిలో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలించగా 12 సంవత్సరాల క్రితం కేసు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తన తల్లి అర్మాన్ ఆలమ్ ను గుర్తించి హైదరాబాద్ కార్ఖానాకు వచ్చి 12 సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూసి సంతోషం వ్యక్తం చేసింది. ఈ కేసులో మరో ఇద్దరు నింధితులు దీపక్ యాదవ్, బొమ్మకంటి ప్రదీప్ గౌడ్ లను పోలీసులు ఆరెస్ట్ చేశారు. అయితే కేసులను చాకచాక్యంగా చేధించిన కార్ఖాన ఇన్ స్పెక్టర్ రాధాక్రిష్ణ, క్రైమ్ ఎస్సై రవికుమార్ ,హెడ్ కానిస్టేబుల్ సి.హెచ్ .రవికుమార్, కానిస్టేబుల్ బి.రాజేష్, పి.నవీన్ కుమార్ లను డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ అభినందించారు.

Next Story

Most Viewed