హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాగోల్-ఎల్బీనగర్ మధ్య భారీ స్కై వాక్

by GSrikanth |
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాగోల్-ఎల్బీనగర్ మధ్య భారీ స్కై వాక్
X

దిశ, సిటీబ్యూరో: పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టు మరో అడుగు ముందుకు పడింది. పాతబస్తీలోని మెట్రో రైలు పనులకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాగోల్ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు ఏర్పాటు చేయనున్న 14 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ప్రాంతాన్ని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి కాలినడకన పర్యటిస్తూ శనివారం పరిశీలించారు. ముఖ్యంగా నాగోల్ నుంచి ఏయిర్ పోర్డు వరకు ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు అలైన్‌మెంట్, ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న అంశాలపై ఎండీ ఈ పరిశీలన జరిపినట్లు సమాచారం. ఈ పర్యటనలో మెట్రో రైలు ఉన్నతాధికారులు, ప్రాజెక్టు పనుల కోసం డీపీఆర్ రూపకల్పన బాధ్యతలను చేపట్టిన సిస్ట్రా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణలు సైతం ఎండీని అనుసరించి కాలి నడకన ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి కిలోమీటరకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ పర్యటనలో హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ సీఈఈ డీవీఎస్ రాజు, సీఎస్ టీఈ ఎస్‌కే.దాస్, మెట్రో అధికారులు బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ బీఎన్ రాజేశ్వర్, ఎస్‌ఈ వై.సాయపరెడ్డి, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు.

పనులపై ఎండీ ఆదేశాలు, సూచనలు...

నాగోల్- ఏయిర్ పోర్ట్ మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్ ప్రస్తుతమున్న నాగోల్ స్టేషన్‌కు దగ్గరలోనే ఎడమ వైపు (ఎల్బీనగర్ వైపు) ఉన్నందున, ప్రయాణికులు సౌకర్యార్థం ఈ రెండు స్టేషన్లను కన్ కోర్స్ లెవెల్‌లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టాలి.

నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నదిని ఆనుకుని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ విద్యుత్ కేబుళ్లున్న దృష్ట్యా మెట్రో అలైన్‌మెంట్‌ను మరో పది మీటర్లు ఎడమ వైపునకు జరపాలని ఆదేశించారు. మూసీ నది అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని, మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించాలని సూచించారు.

మూసీ నది దాటిన తర్వాత కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీని ఇస్తూ, ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరి అవసరాల కోసం ఒక అదనపు స్టషన్ నిర్మించే విషయంపై ప్లాన్ చేయాలని ఇంజినీర్లు, నిపుణులకు సూచించారు.

ప్రతిపాదిత నాగోల్ ఆర్టీఓ స్టేషన్ అల్కాపురి జంక్షన్ (లక్కీరెస్టారెంట్)కు సమీపంలో నిర్మించాలని సూచించారు. ఇదీ ఓఆర్ఆర్ కనెక్టివిటీకి ఉపయోగపడుతుందని ఎండీ అభిప్రాయపడ్డారు.

ఫ్లై ఓవర్ కుడివైపున్న కామినేని హాస్పిటల్ స్టేషన్ తర్వాత, ఎల్బీనగర్ స్టేషన్ అక్కడకు దగ్గరలో ఉన్న అండర్ పాస్, రెండు ఫ్లై ఓవర్ల అనేక ఇంజినీరింగ్ సవాళ్లను ఎదుర్కొవల్సి ఉంటుందని ఎండీ వ్యాఖ్యానించారు. జంక్షన్‌కు కుడివైపున ఉండబోయే కొత్త స్టేషన్, కారిడార్ 1లో (మియాపూర్-ఎల్బీనగర్) ప్రస్తుతం ఉన్న ఎల్బీనగర్ స్టేషన్‌కు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

బైరామల్‌గూడ, సాగర్ జంక్షన్లలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లై ఓవర్లు ఉండటం వల్ల ఎయిర్ పోర్టు మెట్రో లైన్ ఇంకా ఎక్కువగా ఎత్తు పెంచాల్సి ఉందన్నారు. ఏయిర్‌పోర్టు మెట్రో కారిడార్ ఎత్తును బైరామల్‌గూడ, సాగర్ రోడ్డు జంక్షన్ మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి గాను, మెట్రో అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందని, పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ నిర్మించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.

మైత్రినగర్, కర్మాన్‌ఘాట్, చంపాపేట జంక్షన్, ఓవైసీ హాస్పిటల్, డీఆర్ డీఓ, హాఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులకు వీలుగా జంక్షన్లకు సమీపంలో నిర్మించాలని సూచించారు.

చాంద్రాయణగుట్టలో ఫ్లై ఓవర్ నిర్మాణం ఉన్నందున అక్కడ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నిర్మాణం, అలాగే చాంద్రాయణగుట్ట వరకు చేపట్టిన పాతనగరం మెట్రో విస్తరణ పనులు, టెర్మినల్ స్టేషన్ నిర్మాణ పనులు ఒక ఇంజినీరింగ్ సవాలుగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రెండు కారిడార్లను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌లో కాంకోర్స్, ఫ్లాట్ ఫారంల ఎత్తును సరిచేయాలని ఎండీ సూచించారు.

నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చాలా ఫ్లై ఓవర్లున్నందున, ప్రైవేటు ఆస్తులను తక్కువగా సేకరించే విధంగా స్టేషన్ల నిర్మాణానికి అనుగుణంగా చాలా జాగ్రత్తగా ప్రణాళికలను సిద్దం చేయాల్సి ఉందని వివరించారు.

మెట్రో స్టేషన్ల స్థల సేకరణకు సంబంధించి, అలాగే స్టేషన్ల పేర్లను ఖరారు చేసే ముందు స్థానిక ప్రజలను, ట్రాఫిక్ పోలీసులను, హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ అధికారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed