వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. ఉపాధి కోసం ప్రత్యేక వెబ్ సైట్

by Mahesh |   ( Updated:2022-12-03 15:03:51.0  )
వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. ఉపాధి కోసం ప్రత్యేక వెబ్ సైట్
X

దిశ, అంబర్‌పేట్: వికలాంగుల సాధికారత కోసం జీవో నెంబర్ 33, 34 ప్రకారం డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ అఫ్ పర్సన్స్ విత్ డిజేబులిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్ నూతన ప్రత్యేక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చొరవతో ఏర్పాటు చేయడం జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని హెలెన్ కిల్లర్, బ్రెయిలీ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశు సంక్షేమ శాఖ వయోజన సంక్షేమ శాఖలో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక వికలాంగుల, వయోవృద్ధుల శాఖగా రూపు దిద్దుకుందన్నారు.

నేటి నుంచి వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖగా వ్యవహరిస్తుందని తెలిపారు. కేసీఆర్ నిర్ణయం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల కోసం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే 33 జిల్లాలలో శాఖలను ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేస్తామన్నారు. కేసీఆర్ అన్ని రంగాల అభివృద్ధి కోసం గత 8 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారన్నారు. అర్హులైన వికలాంగుల కోసం ప్రత్యేక రూపొందించిన బ్యాటరీ సైకిల్, వీల్ చైర్స్ ను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని వివరించారు. వికలాంగులలో ఉన్న ఎస్సీలకు దళిత బందులో 5 శాతం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో 5 శాతం కేటాయించడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 155326 ను ప్రారంభించారు. వికలాంగుల సమస్యలపై సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వికలాంగుల ప్రత్యేక ఉపాధి కల్పన కోసం https://pwdjobs.telangana.gov.in/వెబ్ సైట్ ను ప్రారంభించారు.

ఈ వెబ్ సైట్ ద్వారా వికలాంగులు ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఐఏఎస్ దివ్య రాజన్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని తాను స్వయంగా చూశానని తెలిపారు. వికలాంగుల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం సూచించారు. ఎంతోమంది వికలాంగుల పోరాటం వల్ల శిశు సంక్షేమ శాఖలో విలీనమైన వికలాంగుల సంక్షేమ శాఖను వికలాంగుల, వయోవృద్ధుల శాఖగా రూపు దిద్దుకోవటం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా వికలాంగులకు మెస్ చార్జీలను పెంచి ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అనంతరం వికలాంగులు, వయోవృద్ధుల కోసం 10 చేయూత వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వికలాంగులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ , కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రభంజన్, తానా కార్యదర్శి రవి సామినేని పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed