బీసీల రిజర్వేషన్ ఖరారుపై దూకుడు.. జిల్లాలకు ఏకసభ్య కమిషన్

by srinivas |   ( Updated:2024-11-07 15:34:05.0  )
బీసీల రిజర్వేషన్ ఖరారుపై దూకుడు.. జిల్లాలకు ఏకసభ్య కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఖరారు చేయడానికి నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తుందని ఏకసభ్య కమిషన్ బూసాని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన అన్నారు. కమిషన్ నియమించిన ఉత్తర్వుల్లోనే నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించిందని, దీని కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేయడానికి సుప్రీం, హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం బూసాని వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బీసీ కమిషన్ సభ్యులతో భేటి అయ్యారు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో బూసాని వెంకటేశ్వర్ రావు "దిశ"తో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు త్రిపుల్ టెస్ట్ విధానంలో ఖరారు చేయాలని సూచించిందని వెంకటేశ్వర్ రావు తెలిపారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏకసభ్య కమిషన్ పని చేసి నివేదిక ఇస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమాచారం సేకరించి నివేదిక తయారు చేస్తామన్నారు. జిల్లాల్లో పర్యటించినప్పుడు బీసీ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థల నుంచి సలహాలు, సూచనలు, వినతులు స్వీకరిస్తామన్నారు. నివేదికను ప్రభుత్వం సూచించిన గడువులోగా సమర్పించిన ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిపుణుల సహకారం తీసుకునే ఆలోచన ఇంకా చేయలేదన్నారు. తమ ముందు నివేదికను సమగ్రంగా, నిర్ణిత గడువులోగా నివేదిక అందించడమే తమ ముందు ఉన్న కర్తవ్యమని బూసాని వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed