CM Revanth Reddy : తెలంగాణకు నిధులు కేటాయిస్తూ రీ బడ్జెట్ ప్రకటించాలి.. CM రేవంత్ సంచలన డిమాండ్

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-24 13:24:39.0  )
CM Revanth Reddy : తెలంగాణకు నిధులు కేటాయిస్తూ రీ బడ్జెట్ ప్రకటించాలి.. CM రేవంత్ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై వాడీ వేడి చర్చ జరిగింది. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం కాపాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందని తెలిపారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు.

ఆర్థిక వేత మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేసి దేశాన్ని పరిపుష్టం చేసిందని తెలిపారు. ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ చర్యలు వల్లనే భారత్ ఆర్థికంగా నిలదొక్కుకుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని సీఎం సీరియస్ అయ్యారు. నిలదీసి అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేలా మేము ప్రధాని మోడీని కలిసి నిధులు అడిగాం అన్నారు.

తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయని.. కేంద్రం మాత్రం తెలంగాణకు పదేళ్లలో కేవలం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూ.22.66 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని తెలిపారు. పదేళ్లలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.6లక్షల కోట్లు అన్నారు.

యూపీ నుంచి రూ.3.47 లక్షల కోట్లు పన్నులు వస్తే.. అక్కడ ఖర్చు పెట్టింది. రూ.6.91 కోట్లు అన్నారు. దేశంలో అభివృద్ధి, ఆదాయంలో తెలంగాణది ఎంతో కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఎంతో కీలకమైన హైదరాబాద్‌కు నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలి.. నిధులు సాధించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. కేంద్రం మాత్రం రాష్ట్రాలకు 32 శాతం పన్నులనే పంచుతోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed