TGSRTC : ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు.. పురుడు పోసిన మ‌హిళా ప్ర‌యాణికులు

by Ramesh N |
TGSRTC : ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు.. పురుడు పోసిన మ‌హిళా ప్ర‌యాణికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బ‌స్సులో పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌కు స‌కాలంలో కాన్పు చేయించి టీజీఎస్ ఆర్టీసీ సిబ్బంది త‌మ ఉదార‌త‌ను చాటుకున్నారు. కోదాడ డిపోన‌కు చెందిన ఆర్టీసీ అద్దె బ‌స్సు శ‌నివారం సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తోంది. అందులో గుడిబండ గ్రామానికి చెందిన గ‌ర్భిణి అలివేలు ప్ర‌యాణిస్తున్నారు. బ‌స్సు మున‌గాల మండ‌లం తాడ్వాయి వ‌ద్ద‌కు రాగానే ఒక్క‌సారిగా ఆమెకు పురిటినొప్పులు వ‌చ్చాయి. కండ‌క్ట‌ర్ వి.న‌రేశ్ బాబు అప్ర‌మ‌త్త‌మై.. డ్రైవ‌ర్ న‌రేశ్‌కు చెప్పి బ‌స్సును ఆపించారు. వెంట‌నే అంబులెన్స్ కోసం 108 కాల్ చేశారు. నొప్పులు ఎక్కువ కావ‌డంతో బ‌స్సులోని తోటి మ‌హిళా ప్ర‌యాణికులు ఆమెకు పురుడుపోశారు.

మహిళ ఆడ శిశువుకు జన్మించింది. వారిని అంబులెన్స్ సాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ విషయాలను ఎక్స్ వేదికగా శనివారం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోస్ట్ చేశారు. బ‌స్సులో పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసిన మ‌హిళా ప్ర‌యాణికుల‌కు, స‌మ‌యస్పూర్తితో వ్య‌వ‌హారించిన ఆర్టీసీ సిబ్బందికి స‌జ్జ‌నార్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. వారు అప్ర‌మ‌త్త‌మై స‌కాలంలో స్పందించ‌డం వ‌ల్లే త‌ల్లిబిడ్డా క్షేమంగా ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed