International School: పాత బిల్డింగ్‌కు కొత్త హంగులు

by Indraja |
International School: పాత బిల్డింగ్‌కు కొత్త హంగులు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: పైన పటారం లోన లొటారం చందంగా తయారైంది ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం. పాత బిల్డింగ్ రెనోవేషన్ పేరిట కొత్త టైల్స్.. ప్లోరింగ్.. అందమైన గార్డెన్ ఏర్పాటు చేసి ఇదే ఇంటర్నేషనల్ స్కూల్ అని కలర్ ఇస్తున్నారు. దీంతో పేరెంట్స్ మా ముంగిటనే ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటైందని సంబురపడుతున్నారు.

రూ.లక్షలు వెచ్చించి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. రేపో మాపో తరగతులను ప్రారంభించేందుకు యాజమాన్యం కూడా రెడీ అవుతోంది. అయితే పాత బిల్డింగ్‌లో ఇంటర్నేష్‌నల్ స్కూల్‌కు అనుమతులు ఎలా వచ్చాయి అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. కుత్బుల్లాపూర్ మండలం, హెచ్ఎంటీ కాలనీలో ఏర్పాటవుతున్న వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై ‘దిశ’ కథనం.

1972 నాటి బిల్డింగ్..

కుత్బుల్లాపూర్ మండలం సర్వే నెం. 257, 258 హెచ్ఎంటీ కాలనీలో ఐదెకరాల విస్తీర్ణంలో 37 తరగతి గదులతో పురాతన స్కూల్ భవనం ఉంది. ఈ భవనంలో 1972లో ‘హెచ్ఎంటీ వాకో హైస్కూల్’ ఉండేది. ఇది 2000 సం వత్సరంలో మూతపడింది. ఇక కొన్నాళ్లుగా ఆ భవనం ఖాళీగా ఉంది. మధ్యలో బిజినెస్ స్కూల్ ఏర్పాటై అది కూడా మూతపడింది.

ఈ భవనాన్ని హెచ్ఎంటీ నుంచి లీజుకు తీసుకొని ‘వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్’ ప్రారంభించారు. 50 సంవత్సరాలు పైబడిన ఈ భవనంలో స్కూల్‌కు ఎలా అనుమతులు ఇచ్చారనే ప్ర శ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇంటర్నేషనల్ స్కూల్‌కు అనుమతులు అంటే ఆషామాషీ కాదు బిల్డింగ్ శాంక్షన్ ప్లాన్, స్ట్రెంత్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ, ట్రాఫిక్, మున్సిపల్ ఎన్ఓసీ, హైజెనిక్, తదితర ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఇంత పాత బిల్డింగ్ అందులో కొన్ని కూలిపోగా.. మరికొన్ని అప్పుడా? ఇప్పుడా? అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి వాటికి అనుమతులు ఇచ్చారా? ఇవ్వలేదా? అనుమానాలున్నాయి.

పైపై మెరుగులు..

పురాతన భవనానికి రంగులు వేసి మెరుగులు దిద్దారు. గార్డెన్, ప్లే గ్రౌండ్, ఫాల్ సీలింగ్ తదితర హంగులు జోడించి అబ్బురపడేలా షో చేశారు. ఈ పాఠశాలను ఇటీవల ఓ ప్రజా ప్రతినిధి ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ స్కూల్ వస్తే హ్యాపీనే కానీ ఇంత పాత బిల్డింగ్ అంటే వామ్మో అంటున్నారు స్థానికులు. దీనిపై డీఈవో విజయ కుమారిని ‘దిశ’ వివరణ కోరగా, అనుమతులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అనుమతులు ఎలా వచ్చాయన్నదానిపై క్లారిటీ మాత్రం లేదన్నారు.

Advertisement

Next Story