TRS పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ.. తెర వెనుక ఉన్నదెవరు?

by GSrikanth |   ( Updated:2023-03-04 23:31:09.0  )
TRS పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ.. తెర వెనుక ఉన్నదెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఆ పార్టీ అధినేత గతేడాది అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. దీంతో టీఆర్ఎస్ పేరు మనుగడలో లేకుండాపోయింది. తెలంగాణ ప్రజలకు చిరపరిచితమైన ఆ పార్టీ పేరు రాష్ట్రంలో పాపులర్. ఇప్పుడు దాన్ని వాడుకుని ఎన్నికల్లో సీట్లు గెలవడానికి రంగం సిద్ధమవుతున్నది. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి తదితర పేర్లతో (షార్ట్‌గా టీఆర్ఎస్ అని పిలుచుకునేలా) ఒక కొత్త పార్టీని నెలకొల్పడానికి కొద్దిమంది సీనియర్లు లోతుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేర్లతో తెలంగాణలో కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కంప్లీట్ చేయలేదు.

కొత్త పార్టీని పెడుతున్నది ఎవరు, తెర వెనకగా కథను నడిపిస్తున్నదెవరు, దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు, దీన్ని ముందుండి నడిపించేదెవరు.. ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారిన వెంటనే ఖమ్మం నుంచి కొద్దిమంది అబ్రివేషన్‌ ప్రకారం టీఆర్ఎస్ అని వచ్చేలా కొత్త పార్టీ కోసం కసరత్తు జరిగింది. కానీ అది ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసేవరకూ వెళ్ళకుండానే ఆగిపోయింది. టీఆర్ఎస్ పదానికి తెలంగాణ ప్రజల్లో, ఓటర్లలో ఉన్న ఆకర్షణను దృష్టిలో పెట్టుకుని మూడు పేర్లలో ఏదో ఒకదాన్ని రిజిస్టర్ చేసుకోవడంపై రాష్ట్రంలో చర్చలు ఊపందుకున్నాయి. గతంలో ప్రధాన పార్టీల్లో పనిచేసిన సీనియర్ నేతలే ఈ దిశగా కథను నడిపిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈసారి ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగడానికి వైఎస్సార్టీపీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) పేరుతో షర్మిల సిద్ధమయ్యారు. జాతీయ పార్టీ స్థాయికి ఎదిగిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గతంలో ఎన్నిటికంటే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముమ్మర పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలుకావడంతో ఎవరికి టికెట్ వస్తుందో రాదోననే సందేహం చాలా మంది సీనియర్లలో నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతతో కొద్దిమంది సీనియర్ల గైడెన్సు మేరకు మూడు పేర్లలో ఒకదాన్ని ఫైనల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు వార్తలు వినిపించాయి.

బీఆర్ఎస్ పార్టీగా మారడంతోనే ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌కు దూరమైందని, ఇప్పుడు దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని కొత్త పార్టీతో కొన్ని సీట్లు గెల్చుకోవచ్చనే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి. వివిధ పార్టీల్లో సీనియర్ నేతలుగా ఉన్నవారు ఇప్పటికే ఏదో ఒక పార్టీ గూటికి చేరినా అసంతృప్తితో దీర్ఘకాలం కొనసాగలేమనే ఉద్దేశంతో తెర వెనకగా ఈ కథను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారంతా ఉమ్మడిగా చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారని, ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వ్యవహారం వెళ్ళకముందే లీక్ అయిందని మూడు ప్రధాన పార్టీల నేతల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పట్ల తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నవారే దీనికి ఆజ్యం పోసినట్లు సమాచారం.

ఈసారి టికెట్ రాదనే అనుమానం ఉన్నవారూ, పార్టీలో తగిన గౌరవం, స్థానం, ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో ఉన్నవారే కొత్త పార్టీ ఆలోచనల్లో కీలక భూమిక పోషిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మల్కాజిగిరి చిరునామాతో ఇప్పటికే తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ పేరుతో ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు వెళ్ళింది. ఇకపైన తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో దరఖాస్తులు వెళ్ళే అవకాశం ఉన్నది. కొత్త పార్టీ వెనక ఉన్న సీనియర్ నేతలు కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలంటూ లీకులు కూడా వెలువడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గానే కొత్తగా పెట్టబోయే పార్టీకి షార్ట్ గా టీఆర్ఎస్ అని వచ్చేలా సుదీర్ఘ కసరత్తు తర్వాత పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది.

బీఆర్ఎస్ పేరు ఇంకా ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్ళనందున టీఆర్ఎస్ అనే భావనతోనే ఉన్నారని, ఆ పేరే ఎన్నికల్లో బాగా కలిసొస్తుందనేది కొత్త పార్టీని పెట్టాలనుకుంటున్నవారి ఆలోచన. కొత్త పార్టీ అనగానే అందరి దృష్టీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పడింది. ఖమ్మంలో జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ బహిరంగసభకు కొన్ని రోజుల ముందు నుంచే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న విభేదాలు తీవ్రమయ్యాయి. బీఆర్ఎస్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మండల స్థాయి లీడర్ల వరకు సంప్రదింపులు జరిపారు. జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన తరపున పోటీచేసే ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చినా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆయనపై ఒత్తిడి కూడా వచ్చింది. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ చేరకుండా పొంగులేటి శ్రీనన్న పేరుతోనే పాలిటిక్స్ నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతతో ఆయనే కొత్త పార్టీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే చర్చలు మొదలయ్యాయి. ఖమ్మంలోని ఆయన ఇంటిముందు ఇటీవల కొన్ని గంటల పాటు తెలంగాణ రైతు సమితి పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తవుతుందని, ఎన్నికల నాటికి టీఆర్ఎస్ అనే షార్ట్ నేమ్‌తో ప్రజల్లోకి తీసుకెళ్ళి కనీసంగా 30 స్థానాల్లో గెలుపొందే వ్యూహం కొద్దిమంది సీనియర్ నేతల ద్వారా బైటకు వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి రిజల్టు తర్వాత చక్రం తిప్పవచ్చనేది వారి ఆలోచన.

కొత్త పార్టీ వెనక కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు గ్రామం మొదలు జిల్లా స్థాయి వరకు రాజకీయంగా అంగబలం, ఆర్థిక పరిపుష్టి ఉన్నవారే. రానున్న మరికొన్ని రోజుల్లో ఈ పార్టీకి సంబంధించిన వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Advertisement

Next Story