జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Kishan Reddy lashes out at TRS Flexi Politics
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కానుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందని, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోనుందని హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన జూన్ 4వ తేదీన అందరిని ఆశ్చర్యపరిచేలా ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పోటీ పడి మరీ బీజేపీపై అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు మోడీకి అండగా నిలిచారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసత్యాలను ప్రజలు నమ్మకపోగా, తెలంగాణలో ఎవరు గెలిచినా.. మేమే కీలకం అన్నట్లు మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోందని తమకు డబుల్ డిజిట్ సీట్లు ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీనే మళ్లీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష తెలంగాణ గ్రామాల్లో స్పష్టంగా కనిపించిందని, యువత, మహిళలు, రైతులు, కొత్త ఓటర్లు ఏకపక్షంగా బీజేపీకి అండగా నిలిచాయని మా విశ్లేషణలో వెల్లడైందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు రాబోతున్నాయన్నారు.

నీచ రాజకీయాలపై కాకుండా హామీల అమలుపై దృష్టి పెట్టండి:

ప్రజలు గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేశారు. ఈసారి బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయని విమర్శించారు. హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ పాత హామీల గురించి మాట్లాడటం మర్చిపోయి కొత్త హామీలిచ్చి పోయాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో రాజీ పడబోమని, హామీల అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ ఎలా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు పరిపాలనే మొదలు పెట్టని రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు రెఫరెండం అని చెప్పారని, ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఏం చేస్తారో రేవంత్ రెడ్డినే చెప్పాలన్నారు. ఇకనైనా బురదజల్లే నీచ రాజకీయాలపై కాకుండా హామీల అమలుపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు.

ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నాం:

పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని, ఓటరు లిస్టును సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసినా పెద్దఎత్తున ఓట్లను తొలగించారన్నారు. వారం రోజుల ముందు ఓటరు స్లిప్పులు పంపిన ఓటర్లను కూడా తీసేశారని ధ్వజమెత్తారు. కావాలనే బీజేపీ ఓట్లను తొలగించాని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. ఎన్నికల ఓటరు కార్డును, ఆధార్ తో సీడింగ్ చేయాల్సిన అవసరం ఉందని దీనిపై అత్యున్నతస్థాయి సమీక్ష జరగాలన్నారు. రిగ్గింగ్ జరిగిన బూతుల వివరాలు సేకరిస్తున్నామని అక్కడ రీపోలింగ్ కు డిమాండ్ చేస్తామన్నారు.

Advertisement

Next Story