లోకల్ లీడర్లలో సరికొత్త అలజడి.. KCRకు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ స్ట్రాటజీ!

by Sathputhe Rajesh |
లోకల్ లీడర్లలో సరికొత్త అలజడి.. KCRకు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ స్ట్రాటజీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో రెండు టర్ముల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నదంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే విమర్శలను మూటగట్టుకున్నది. తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయడానికి ఈ అస్త్రాన్ని ప్రయోగించిందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. స్పీకర్లు సైతం పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే నిందలు మోశారు. స్పీకర్లకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అలాంటి ప్రాక్టీసుకు పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ పరిణామాలను ఎదుర్కొంటున్నది. అప్పుడు ‘ఇన్‌ కమింగ్‌’గా ఉన్న వలసలు ఇప్పుడు ‘ఔట్ గోయింగ్’గా మారాయి. నాడు అమలు చేసిన ఎత్తుగడలే ఇప్పుడు రివర్సు కొడుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో చేరికలతో సొంత పార్టీ లీడర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

బీఆర్ఎస్ లీడర్లలో అలజడి

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ లీడర్లలో అలజడి మొదలైంది. భవిష్యత్తుపై వారు ఆందోళనలో పడ్డారు. పార్టీలో నెలకొన్న పరిణామాలను గమనంలోకి తీసుకుని జాగ్రత్త తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు ఆలోచనలకు పదును పెడుతున్న సమయంలోనే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దెబ్బకొట్టాయి. గులాబీ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ పరిస్థితులు ఆ పార్టీ నేతల్లో ఆందోళన, భయాన్ని మరింతగా పెంచినట్టయ్యాయి.

ఒక్కొక్కరుగా..

కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాల కొసమే భేటీ కావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నా.. ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే హస్తం పార్టీలోకి చేరుకోగా.. మరికొందరు ఆ ప్రయత్నాల్లో లీనమయ్యారు. ఏ రోజు ఎవరు చేరుతారో తెలియని సస్పెన్స్ గులాబీ పార్టీలో నెలకొన్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులతో మొదలైన వలసలు తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ వరకూ వచ్చాయి.

మరోవైపు బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి సైతం ఒత్తిడి పెరగడంతో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది. తొలుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఆ తర్వాత మాజీలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నది. ఈ పరిణామాన్ని గమనించిన బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్.. ఎవరు ఎప్పుడు చేజారుతారో తెలియని అనుమానంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. పార్టీని విడిచి వెళ్లొద్దని వారిని కన్విన్స్ చేస్తున్నారు. ప్రలోభాలు, పదవులు, పనులకు లొంగిపోయి పార్టీ మారే ఆలోచనలు చేయవద్దంటూ వారికి నచ్చచెప్తున్నారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, తొందరపడొద్దంటూ ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తున్నారు.

రెచ్చగొట్టిన బీఆర్ఎస్ నేతలు..

‘మ్యాజిక్ ఫిగర్‌ కన్నా నాలుగు సీట్లే కదా ఎక్కువ వచ్చింది... మాకంటే 1.8% ఓటు బ్యాంకు మాత్రమే కదా ఎక్కువ ఉన్నది..’ వంటి కామెంట్లతో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారు. ‘ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం ఉంటుందా... మళ్లీ వచ్చేది మా కేసీఆరే..’ అని కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ఉపద్రవం పొంచి ఉన్నదనే అనుమానాలూ పెరిగాయి. ప్రభుత్వం స్థిరంగా కొనసాగకుండా చిక్కులు సృష్టించే కుట్రకు బీఆర్ఎస్ పాల్పడుతున్నదంటూ కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గానే కామెంట్ చేశారు. బీఆర్ఎస్ లీడర్ల మాటలకు సీఎం రేవంత్‌రెడ్డి (పీసీసీ చీఫ్ కూడా) గట్టగానే కౌంటర్ ఇచ్చారు. మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేతల్లోనూ గట్టి గుణపాఠం నేర్పాలన్న కసి కాంగ్రెస్ లీడర్లలో పెరిగింది. కేసీఆర్ ఇంతకాలం అమలు చేసి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టినందుకు రిటన్ గిఫ్టుగా అదే తీరులో సమాధానం చెప్పాలనే వ్యూహానికి హస్తం పార్టీ పదును పెట్టింది.

చేరికలతో అసమ్మతి

ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి చేరికల సంగతి ఎలా ఉన్నా లోకల్‌గా ఒరిజినల్, వలస నేతల మధ్య వైరుధ్యం అధికార పార్టీ నాయకత్వానికి సవాలుగా మారింది. సొంత పార్టీ లీడర్‌లలో తలెత్తే అసంతృప్తి, పెరిగే అసమ్మతిని కూల్ చేయడం తక్షణ అవసరంగా మారింది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. దీంతో అక్కడి లీడర్‌గా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలకపూనారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. సీనియర్ లీడర్‌గా జీవన్‌రెడ్డిని దూరం చేసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వెంటనే పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హుటాహుటిన జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరిస్థితులను వివరించి తాత్కాలికంగా సర్దిపుచ్చారు. ఇప్పటికే ఖైరతాబాద్, భద్రాచలం నియోజకవర్గాల్లో ఒరిజినల్ వర్సెస్ వలస లీడర్ల అగాధం బయటకొచ్చింది.

నాడు బీఆర్ఎస్ అమలు చేసిన స్ట్రాటజీని నేడు కాంగ్రెస్ అనుసరిస్తోందన్న జనరల్ టాక్ రెండు పార్టీల లీడర్లలోనూ వినిపిస్తున్నది. అప్పుడు కాంగ్రెస్ లీగల్ ఫైట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అదే బాటను ఎంచుకోక తప్పలేదు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కేశవరావు ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్‌కు దగ్గరైనప్పుడే గులాబీ పార్టీలో అలజడి రేగింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరిపోవడంతో గులాబీ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎంతమంది చేజారిపోతారోననే ఆందోళనతో హడావుడిగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ మారొద్దంటూ తనదైన శైలిలో కన్విన్స్ చేసే ప్రయత్నాలను మొదలుపెట్టారు. అసెంబ్లీ సెషన్ మొదలయ్యే సమయానికి కాంగ్రెస్ స్కోర్ 80కు చేరుకుంటుందని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరెవరు పార్టీలో చేరనున్నారో దానం నాగేందర్ మూడు రోజుల క్రితమే పేర్లతో సహా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

న్యాయపోరాటానికి బీఆర్ఎస్

న్యాయపోరాటంతో వలసలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు వాదిస్తున్నారు. కానీ పార్టీ మారిన వారి విషయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్‌పై స్పీకర్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు గులాబీ లీడర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజల్లో ఎండగట్టవచ్చన్నది కారు పార్టీ వ్యూహం వెనక ఉన్న ఉద్దేశం.

Advertisement

Next Story

Most Viewed