RRR సినిమా షూటింగ్ జరిగిన అడవికి పొంచివున్న ముప్పు.. సోషల్‌ మీడియాలో సరికొత్త ఉద్యమం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-29 11:44:10.0  )
RRR సినిమా షూటింగ్ జరిగిన అడవికి పొంచివున్న ముప్పు.. సోషల్‌ మీడియాలో సరికొత్త ఉద్యమం
X

పెరుగుతున్న నగరాలతో పచ్చటి అడవులు, ఆహ్లాదకరమైన ప్రకృతి కంటికి కనిపించడమే తగ్గిపోయింది. ఉన్న కాస్త అడవులను కూడా నరికివేయాలని ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవడంపై స్థానికంగా నిరసన వ్యక్తం అవుతున్నది. అనంతగిరిని ఆనుకుని ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిన దట్టమైన అడవి. కొన్ని లక్షల అరుదైన ఔషధ మొక్కలతో పాటు అరుదైన పక్షులు, జంతు జాతులకు నిలయం. సినిమా షూటింగులకు అనువైనదిగా పేరు పేరుగాంచింది. ఈ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కాబోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రాంతంపై అభిమానం ఉన్న నెటిజన్లు సోషల్ మీడియాలో ‘# సేవ్ దామగుండం’ పేరిట నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు దామగుండం అడవి ఎక్కడ ఉంది..? దాని చరిత్ర ఏంటి..? పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేకతలు అక్కడ ఏమున్నాయో తెలుసుకుందాం. = నాళపురం ప్రమోద్ కుమార్

దట్టమైన అడవి.. ఆహ్లాదకరమైన ప్రక‌ృతికి నెలవు దామగుండం రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్న ఔషధ మొక్కల గాలి పిలిస్తే చాలు సర్వరోగాలు నయం అవుతాయని అంటారు. అందుకే దామగుండం వెళ్తే యమగండం కూడా పోతుంది అని నానుడి ఉంది. ఇక్కడికి ప్రతి శని ఆదివారాలు వేల సంఖ్యలో పర్యటకులు వచ్చి వెళ్తుంటారు. అలాగే దామగుండం అడవిలో కొలువైన రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎన్నో ఏళ్ళ ఘన చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరానికి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలకు అత్యంత దగ్గరగా ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ నేడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది.

నౌకాదళ కమ్యూనికేషన్ స్టేషన్

దేశంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ఏర్పాటుకు నౌకాదళం దామగుండం అటవీ భూమిని ఎంపిక చేసుకున్నది. ఈ కమ్యూనికేషన్ సెంటర్ తో సుదూర తీరాల్లోని నౌకలు, జలాంతర్గాములతో సంభాషించే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థ కారణంగా దేశ నౌకాదళ అధికారుల మాటలను శత్రువులు దొంగచాటుగా వినే అవకాశం ఉండదు. ఈ తరహా స్టేషన్ తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్నది. దేశంలోనే తొలి రాడార్ స్టేషన్ ఐఎన్ఎస్ కట్టబొమ్మన్. దీనిని 1990లో ఏర్పాటు చేశారు. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. 1,174 హెక్టార్ల అటవీ భూమి నేవీకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా దామగుండంలోని రామలింగేశ్వర ఆలయానికి ఇబ్బంది తలెత్తకుండా చూడటంతోపాటు భక్తులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది. కాగా, ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు కూడా ఉంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసించే అవకాశం ఉన్నది. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు కానున్నది.

దామగుండం ఎలా వెళ్లాలి

హైదరాబాద్ మహానగరానికి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ జిల్లా, మన్నెగూడ నుండి పరిగి పట్టణానికి వెళ్లే దారిలో హైవే నంబర్ 163కి దగ్గరగా పూడూర్‌ మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో దామగుండం గ్రామం ఉంది. ఇక్కడికి వికారాబాద్‌ జిల్లా వాసులే కాకుండా శని ఆదివారాల్లో వివిధ ప్రాంతాల నుంచి వేలమంది పర్యాటకులు వస్తుంటారు. గ్రామంలో రామలింగేశ్వర పుణ్యక్షేత్రానికి సుమారు 800 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని పురాణాల ద్వారా తెలుస్తున్నది. పూర్వం విబండ మహర్షి అనే మునీశ్వరుడు ఈ దేవాలయం ఉత్తరం వైపున ఉన్న గుహలో తపస్సు చేసినట్లు చెప్పుకుంటారు. ఈ గుహ ఇప్పటికీ ఉంది.

ఆలయ చరిత్ర

వనవాసంలో ఉండగా రాముడు ప్రతిష్టించిన కోటిలింగాల్లో దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. పూర్వం ఎంతోమంది మహర్షులు ఈ క్షేత్రంలో తపస్సు చేసేవారు. మునులు, రుషులచే ఆరాధించిన శ్రీరామ చంద్రులవారు ఇసుకతో తయారు చేసిన శివలింగం భూమిలో అంతర్థానమై కలియుగంలో మళ్లీ బయటపడిందని స్థల పురాణం చెబుతున్నది. ఈ ఆలయ చరిత్ర ప్రకారం కలియుగంలో దామయ్య గుండయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఒకరోజు వ్యవసాయ పొలంలో నాగలితో పొలం దున్నుతూ ఉంటారు. నాగలి భూమి లోపలికి వెళ్లకపోవడంతో బరువు కోసం పక్కనే ఉన్న ఒక రాయిని నాగలిపైన పెడతారు. పొలం దున్ని సాయంత్రం ఇంటికి వెళ్లి మరుసటి రోజు మళ్లీ పొలానికి వచ్చేసరికి నాగలిపై ఆ రాయి ఉండదు. రాయి ఏమైందని మళ్లీ వెతకగా ఎక్కడినుంచి అయితే తీసుకున్నారో అక్కడికే రాయి వెళ్లి చేరింది. మూడవ రోజు కూడా ఇలానే జరిగే జరికి.. ఆరోజు రాత్రి అన్నదమ్ములు ఒక చెట్టు చాటున దాక్కొని ఏం జరుగుతుందా? అని చూశారు. అప్పుడు ఆ రాయి తనంతట తానే తాను ఉన్న ప్రదేశానికి వెళ్లిపోవడం గమనించారు. దాంతో ఆశ్చర్యానికి గురైన అన్నదమ్ములు ఈ రాయిలో ఏదో మహిమ ఉంది అంటూ భయం భయంగా ఇంటికి వెళ్లారు. ఆరోజు రాత్రి వారి కలలోకి వచ్చిన రామలింగేశ్వర స్వామి, ఇది సామాన్య శిల కాదని ఆ లింగ వృత్తాంతమును వివరించి ఇక్కడే గుండం తవ్వి నా లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయండి అని చెబుతాడు. ఇలా రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఏర్పడింది. దామయ్య గుండయ్యలచే ఈ పుణ్యక్షేత్రం ఏర్పడిన కారణంగా ఈ క్షేత్రం దామగుండం పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని దర్శనం ఈ ఆలయంలో ప్రత్యేకత.

సర్వరోగాలు మాయం

రామలింగేశ్వర స్వామి ఆలయంలోని గుండంలో మునిగితే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని, సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ గుండం నిరంతరం సంవత్సరం పొడవునా నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఈ గుండానికి మరో చరిత్ర కూడా ఉంది. ఈ గుండం మధ్యలో ఉన్న గుడిలో శివలింగం ప్రతిష్ఠించి ఉంది. ఈ లింగం ఉన్న గుడి మీదుగా ఎవరూ కూడా రాయిని ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు విసరలేరు. ఒకవేళ విసిరితే వారు అదృష్టవంతులని వారు కోరుకున్న కోరికలు తీరుతాయని అంటారు. ఇక్కడ ప్రతిఏటా శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణమాసం నెలరోజుల పాటు ఎంతో మంది భక్తులు వనభోజనాలు ఏర్పాటు చేసుకొని కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు జరుగడంతోపాటు వేలమంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ప్రతి ఏడాది ఉగాదికి 6 రోజుల ముందు జాతర ప్రారంభమవుతుంది.

వనమూలికలతో ప్రత్యేక భోజనం

అనేక రకాల ఔషధ మొక్కలు, వనమూలికలకు నిలయం ఈ అడవి. అందుకే దామగుండం ఆలయం బాగోగులు చూసుకుంటు ఇక్కడే నివసిస్తున్న సత్యానంద స్వామీజీ ప్రతినెల మొదటి తారీఖున అనేక రకాల వనమూలికలతో తయారు చేసిన భోజనం భక్తులకు అన్నప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదం తింటే శరీరంలో ఉన్న సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల గాఢవిశ్వాసం. అందుకే జిల్లాలోని ప్రజలే కాక ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఈ ప్రసాదం కోసం తరలివస్తుంటారు.

సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ

అనంతగిరి అడవి మాదిరే దామగుండం అడవిలో కూడా లక్షల ఔషధ మొక్కలతో పాటు, అరుదైన పక్షులు, జంతు జాతులు ఉన్నాయి. రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు దామగుండం అడవి అందాలను ఆస్వాదించడానికి శని ఆదివారాలలో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దామగుండం చుట్టుపక్కల రిసార్ట్స్ లేకపోవడంతో అక్కడి నుంచి అనంతగిరి ఫారెస్ట్‌కు వెళ్లి రాత్రి అక్కడ ఉన్న రిసార్ట్స్‌లలో సేదతీరి తిరిగి వెళుతూ ఉంటారు. ప్రధానంగా దామగుండం అడవిలో సినిమా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. హీరో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే నడిచింది. అడవి ప్రాంతంలో సినిమా షూటింగ్ అనగానే అనంతగిరితో పాటు దామగుండం అడవినే ఎంచుకుంటారు. తెలుగుతోపాటు హిందీ పరిశ్రమ, ఇతర పరిశ్రమ వారు కూడా ఇక్కడ సినిమా షూటింగులు చేస్తూ ఉంటారు.

నేవీ రాడార్‌తో ప్రకృతికి ముప్పు:వై గీత, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి

ప్రకృతి అందాలకు నిలయం అయిన దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రకృతికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. ఎన్నో ఔషధ మొక్కలు, అరుదైన పక్షులు, అనేక జంతు జాతులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాంటి అడవిలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల ప్రజలతోపాటు పక్షులు, జంతు జీవులకు ముప్పు వాటిల్లుతుంది. 12 లక్షలకు పైగా చెట్లు నరికివేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దామగుండంపై పునరాలోచన చేసి.. రాడార్ స్టేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

ప్రజలు అడవినే నమ్ముకుని జీవిస్తున్నారు: మల్లేశ్, ఏఐకేఎమ్ఎస్ జిల్లా సెక్రటరీ

దామగుండం అడవిని నమ్ముకుని చుట్టు పక్కల గ్రామస్తులు ఎంతో మంది జీవిస్తున్నారు. పాడి పశువులను మేపాలన్నా దామగుండం అడవి పైనే ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఇలాంటిచోట నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అడవి వైపు ఎవ్వరినీ రానివ్వరు. దీనివల్ల గ్రామస్తులకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది.

Advertisement

Next Story