- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్కు ఝలక్.. 28 తర్వాత బీజేపీలోకి కీలక నేత?
దిశ, తెలంగాణ బ్యూరో : మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారింది. ఇప్పటికే నేతల మధ్య విభేదాలు, సీనియర్లకు ప్రాధాన్యత కల్పించడంలేదని ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. పార్టీలో ఉన్నవారిని చేజార్చుకోకుండా కాపాడుకోవడంలోనూ ఫెయిల్ అయింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా మరో కీలక నేత హస్తం పార్టీకి త్వరలో గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. కార్మికుల పక్షపాతి అయిన దివంగత మంత్రి జనార్దన్ రెడ్డి(పీజేఆర్) తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ వీడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఇటీవల ప్రకటించిన జంబో కమిటీలోనూ ఆయనకు చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన కాషాయ గూటికి చేరుతాడని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
ఇటీవల కొద్దికాలంగా పార్టీ యాక్టివిటీస్కి విష్ణువర్ధన్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన సోదరి విజయారెడ్డి సైతం టీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరింది. ఈ విషయంలో తనకు సోదరి నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. పీజీఆర్ మరణం తర్వాత ఖైరతాబాద్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విష్ణు గెలుపొందారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేయాలా? జూబ్లీహిల్స్ నుంచి పోటీచేయాలా అనే సందిగ్ధంలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. కాగా తన సోదరి విజయా రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆమెకు ఖైరతాబాద్ టికెట్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. అందుకే కొద్ది రోజుల క్రితం కూడా పార్టీని వీడుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లు ఆయనను బుజ్జగించారని తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు హస్తం పెద్దలు ఇటీవల ఆయన ఇంట్లో లంచ్ మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ జంబో కమిటీలో ఆయనకు చోటు కల్పించడలేదు. దీంతో తీవ్ర అసహనంతో విష్ణు ఉన్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో పార్టీకి సేవలందిస్తున్న తమకు కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన ఇతరులకు పెద్ద పీట వేయడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
విష్ణు వర్దన్ రెడ్డి హస్తం పార్టీని వీడి కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈనెల 28 తర్వాత ఆయన ఏక్షణానైనా పార్టీ వీడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఆయన తన సన్నిహితుల వద్ద పార్టీ మార్పు విషయమై చర్చలు జరిపారు. ఈనెల 28న పీజేఆర్ వర్ధంతి ఉన్న నేపథ్యంలో ఆయన సన్నిహితులతో మరోసారి పూర్తిస్థాయి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. పీజేఆర్ వర్ధంతి అనంతరం మంచిరోజు చూసుకుని బీజేపీలోకి చేరుతారని వినికిడి. ఇదిలా ఉండగా విష్ణువర్ధన్ రెడ్డి ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జంబో బిర్యానీలు పెట్టడం బదులు.. పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తే బాగుండేదని కామెంట్లు చేశారు. సైకిల్ పార్టీ నుంచి వచ్చిన వారు, గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనివారికి జంబో కమిటీలో చోటు దక్కించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవగాహన లేని వారికి పదవులు దక్కుతున్నాయని వాపోయారు. పార్టీ పరిస్థితి బాగోలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ మారాలనుకున్న ప్రతిసారి తన తండ్రి మెడలో కండువా చూసి ఆగిపోతున్నట్లుగా చెప్పాడు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు పార్టీని రఫ్ అండ్ టఫ్ గా వాడుకుని వదిలేస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరైనా సరే భవిష్యత్ ఉండాలనే అనుకుంటారని, పొమ్మనలేక పొగపెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరని చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పు అని వస్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాను నమ్మకంగా ఉండటం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టంగా పేర్కొన్నారు. నగరంలో ఉన్న నలుగురైదుగురు కీలక వ్యక్తులను పార్టీ కాపాడుకోలేకపోతే పార్టీ మనుగడ కష్టమే అని వెల్లడించారు. తమకు పదవులు అక్కర్లేదని, ఇజ్జత్, మర్యాద కావాలని చెప్పిన ఆయన తన తండ్రి వర్ధంతి తేదీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ మొదలైంది.
Also Read...